శనివారం 30 మే 2020
Business - Apr 22, 2020 , 00:06:37

చమురు మైనస్‌ 37 డాలర్లు

చమురు మైనస్‌ 37 డాలర్లు

  • అంతర్జాతీయ విపణిలో పడిపోతున్న ధరలు
  • అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్‌పై కరోనా దెబ్బ
  • లాక్‌డౌన్‌తో తగ్గిన ప్రపంచ వినియోగం
  • ఉత్పత్తికి కోత పెడుతున్నా ఆగని నష్టాలు

కంది పప్పు కావాలా.. అయితే మీరు కిలోకు వంద రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. చక్కెర కావాలా అయితే రూ.40 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది భారత్‌లో.  మరి అమెరికాలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ బ్యారెల్‌ చమురు తీసుకుంటే అదనంగా 38 డాలర్లు జేబులోకి వచ్చిపడుతున్నాయి. ఇది వినడానికి వింతగా ఉన్నా.. ఇదీ అక్కడి ఫ్యూచర్‌ మార్కెట్లో ప్రస్తుత పరిస్థితి. మార్కెట్లో ఏది కావాలన్నా.. వినియోగదారులే నగదు చెల్లించి కొనుగోలు చేయాలి.. కానీ అగ్రరాజ్యం క్రూడాయిల్‌ మార్కెట్లో ఉత్పత్తిదారులు ఎదురిచ్చి చమురునువదిలించుకుంటున్నారు. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ భవిష్య విపణిలో మే నెలకుగాను బ్యారెల్‌ ముడి చమురు ధర మైనస్‌ 37.63 డాలర్లు పలికింది. కాదు.. కాదు..  పతనమైంది.ఒకప్పుడు వస్తూత్పత్తిలో రారాజుగా వెలుగొందిన క్రూడాయిల్‌ను ఇప్పుడు కొనేవారు కరువయ్యారు.  కరోనా కట్టడికి యావత్‌ ప్రపంచం లాక్‌డౌన్‌ కావడంతో పడిపోయిన డిమాండ్‌.. చమురు మార్కెట్‌ ఉసురు తీస్తున్నది. 

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: ఏం జరిగింది.. ఏం జరుగుతున్నది.. ఏం జరుగబోతున్నది.. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయం ముందు వెక్కిరిస్తున్న ప్రశ్నలివి. మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ మహమ్మారి.. ఆర్థికంగానూ యావత్‌ ప్రపంచాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నది. ముఖ్యంగా ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. అమెరికాలో మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా.. ఆ దేశ చమురు మార్కెట్‌లోనూ కల్లోలం రేపింది. మునుపెన్నడూ లేనివిధంగా బ్యారెల్‌ ధర -37.63 డాలర్లకు పతనమైంది. ఒకప్పుడు వస్తూత్పత్తుల్లో రారాజుగా వెలుగొందిన ముడి చమురును.. ఇప్పుడు కొనేవారే కరువయ్యారు మరి. ఉత్పత్తిదారులే వినియోగదారులకు ఎదురు చెల్లించి చమురును వదిలించుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. అవును.. అమెరికాలో చమురు ధరలు మైనస్‌లోకి చేరాయి. వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ (డబ్ల్యూటీఐ) ఫ్యూచర్‌ మార్కెట్‌లో సోమవారం మే నెలకుగాను బ్యారెల్‌ క్రూడ్‌ ధర తొలిసారి -37.63 డాలర్లకు క్షీణించింది. గత ముగింపుతో పోల్చితే ఒక్కరోజులోనే 55.90 డాలర్లు (306 శాతం) క్షీణించింది. శుక్రవారం బ్యారెల్‌ క్రూడాయిల్‌ 18.27 డాలర్లుగా ఉన్నది.

కరోనా వైరస్‌ ప్రభావం

కరోనా వైరస్‌ కట్టడికి ఫిబ్రవరిలో చైనా లాక్‌డౌన్‌ చేయడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. గ్లోబల్‌ క్రూడాయిల్‌ డిమాండ్‌లో 80 శాతానికిపైగా చైనాదే. అలాంటి చైనాలో ప్రయాణం దగ్గర్నుంచి పరిశ్రమల దాకా స్తంభించిపోయాయి. దీంతో చమురు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఈ ఏడాది అంతర్జాతీయ చమురు డిమాండ్‌ రోజుకు 90వేల బ్యారెళ్లుగా ఉండొచ్చని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) గత నెల అంచనా వేసింది. అంతకుముందు నెల ఈ అంచనా 8.25 లక్షలుగా ఉండటం గమనార్హం. బొగ్గు, గ్యాస్‌ తదితర ఇంధనాలపై కంటే చమురు మార్కెట్లపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నది.

ఒపెక్‌-రష్యా ధరల యుద్ధం

రష్యా-ఒపెక్‌ దేశాల కూటమి మధ్య నెలకొన్న ధరల యుద్ధం కూడా చమురు మార్కెట్‌ కొంప ముంచింది. కరోనా నేపథ్యంలో చోటుచేసుకున్న ధరల పతనాన్ని అడ్డుకునేందుకు చమురు ఉత్పత్తిని తగ్గించాలని మార్చిలో సౌదీ అరేబియా ప్రతిపాదించింది. దీన్ని రష్యా తోసిపుచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని బాగా పెంచేసిం ది. ఇది మార్కెట్‌లో మరింతగా ధరల క్షీణతకు దారితీసింది. ఇతర దేశాల చమురు మార్కెట్లపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఒపెక్‌-రష్యాలు 10 శాతం మేర ఉత్పత్తికి కోత పెడుతున్నా.. వినియోగం లేక మార్కెట్‌ మాత్రం నేలచూపుల్నే చూస్తున్నది.

మనకు లాభమేనా?

దేశీయ ఇంధన వినియోగంలో 80 శాతానికిపైగా అవసరాలు దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ ముడి చమురు ధర డాలర్‌ తగ్గినా.. మనకు చమురు దిగుమతుల చెల్లింపుల భారం 1.2 బిలియన్‌ డాలర్లకుపైగా తగ్గుతుందని అంచనా. భారతీయ దిగుమతుల్లో క్రూడాయిల్‌దే మెజారిటీ వాటా. అయితే ఇప్పుడు అమెరికా మార్కెట్‌లో పడిపోయిన ధరలు భారత్‌కు పెద్దగా లాభించే అవకాశాలు మాత్రం లేవు. ఎందుకంటే బ్రెంట్‌ క్రూడాయిల్‌ ప్రామాణికంగా భారత్‌ ట్రేడింగ్‌ జరుగుతున్నది. కాబట్టి అమెరికా డబ్ల్యూటీఐ మార్కెట్‌.. భారత్‌పై పెద్దగా ప్రభావం చూపబోదు. అయినప్పటికీ బ్రెంట్‌ మార్కెట్‌పై ఎంతోకొంత ప్రభావం ఉంటుంది కాబట్టి అది భారత్‌కు లాభించే వీల్లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇప్పటికే భారతీయ రిఫైనరీలు భారీగా చమురు నిల్వలను చేసుకున్నాయి. లాక్‌డౌన్‌తో దేశీయంగా చమురు వినియోగం పెద్ద ఎత్తున పడిపోవడం కూడా బంకర్లు ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయని అమెరికా మార్కెట్‌కు వెళ్లి అక్కడ ముడి చమురును కొనే పరిస్థితి లేదని నిపుణులు చెప్తున్నారు. చమురు వినియోగం భారీగా తగ్గడంతో గతంలో బుక్‌ చేసుకున్న క్రూడ్‌నే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొనుగోలుదారులు ఉన్నారని, అందుకే డిమాండ్‌ లేక ఫ్యూచర్‌ మార్కెట్‌ మైనస్‌లోకి జారుకుందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ అన్నారు. ఇక పెట్రోల్‌, డీజిల్‌పై పెరిగిన ఎక్సైజ్‌ సుంకం, బీఎస్‌-6 శ్రేణి ఇంధనం తయారీ ఖర్చులు తదితర అంశాల దృష్ట్యా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోయినా దేశీయ మార్కెట్‌లో ఇంధన ధరలు వెంటనే తగ్గబోవని చెప్పారు. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.73.97, డీజిల్‌ ధర రూ.67.82గా ఉన్నది.

11% తగ్గిన ధరలు

దేశీయ ఫ్యూచర్‌ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు భారీగా పతనం చెందాయి. మంగళవారం బ్యారెల్‌ ధర ఏకంగా 10.89 శాతం తగ్గి రూ.1,579కి పడిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా చమురుకు డిమాండ్‌ పడిపోవడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో మే నెల డెలివరీ క్రూడాయిల్‌ ధర రూ.193 లేదా 10.89 శాతం తగ్గి రూ.1,579కి పరిమితమైంది. అలాగే జూన్‌ నెలకుగాను బ్యారెల్‌ ధర 9 శాతం(రూ.195) పడిపోయింది.  

నిల్వలు పెంచుకోవాలి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో భారత్‌ తమ వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవడానికి ఇదే సరైన సమయమని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనివల్ల చమురు సరఫరాల్లో ఎదురయ్యే స్వల్పకాలిక అడ్డంకులను అధిగమించవచ్చని చెప్తున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం, మంగళూరు, పాడూర్‌లలో వ్యూహాత్మక చమురు బంకర్లున్నాయి. వీటిలోని నిల్వలతో 9.5 రోజుల వరకు దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవచ్చు. ఒడిషా, కర్నాటకల్లో మరో రెండు బంకర్లను కేంద్రం నిర్మిస్తుండగా, వీటి నిల్వ సామర్థ్యం 6.9 మిలియన్‌ టన్నులు. ఇవి కూడా అందుబాటులోకి వస్తే 21 రోజుల వరకు దేశీయ అవసరాలు తీరుతాయి. ఫ్యూచర్‌ మార్కెట్‌తోపాటు స్పాట్‌ మార్కెట్‌పైనా దృష్టిపెట్టి చమురు నిల్వలను పెంచుకుంటే.. ఈ కష్ట కాలంలో దేశ ద్రవ్యలోటు గణనీయంగా తగ్గించుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటే అప్పుడు ఈ నిల్వలు లాభిస్తాయని, కరోనా దెబ్బకు కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకూ దన్నుగా ఉంటాయని అంటున్నారు.

20 డాలర్ల దిగువకు బ్రెంట్‌

కరోనా వైరస్‌ దెబ్బకు క్రూడాయిల్‌ పాతాళంలోకి పడిపోయింది. అమెరికా ఫ్యూచర్‌ మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ప్రతికూలానికి పడిపోగా..అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ బ్యారెల్‌ ధర 20 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. 2001 తర్వాత ఇంతటి కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. కరోనా వైరస్‌ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు మొత్తం స్తంభించిపోయాయి. ఫలితంగా చమురు డిమాండ్‌ భారీగా పడిపోయింది. యూరోపియన్‌ దేశాల్లో చమురు ధర 18.10 డాలర్లకు జారుకున్నది. 

మార్కెట్‌ కదలికల్నిగమనిస్తున్నాం: సౌదీ

రియాద్‌: చమురు మార్కెట్ల కదలికల్ని నిశితంగా గమనిస్తున్నామని సౌదీ అరేబియా మంగళవారం తెలిపింది. ఒపెక్‌ దేశాలతో కలిసి పరిస్థితులను చక్కదిద్దేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామన్నది. ‘చమురు మార్కె ట్‌ స్థిరీకరణకు మా వంతు కృషి మేము చేస్తాం. వచ్చే రెండేండ్లకుపైగా కాలానికిగాను రష్యాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చమురు ఉత్పత్తిని తగ్గిస్తాం’ అని సౌదీ క్యాబినెట్‌ ఓ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం రోజుకు 2.5 మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తికి కోత పెట్టాలి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండగా, ఇంధన వినియోగం బాగా పడిపోయింది. ఉత్పత్తికి తగ్గ డిమాండ్‌ లేకపోవడంతో మార్కెట్‌లో ధరలు క్షీణిస్తున్నాయి. ఈ క్రమంలో ఒపెక్‌ దేశాలు కాకుండా మిగతా దేశాలూ అదనంగా రోజుకు 3.7 మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు అంగీకరించాయి.

ట్రంప్‌ దూకుడుతో కష్టాలు

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూకుడు.. అమెరికా కష్టాలను మరింతగా పెంచుతున్నది. కరోనా వైరస్‌ను తేలిగ్గా అంచనా వేసి చేతులు కాల్చుకున్న అగ్రరాజ్యం.. ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తున్నది చూస్తూనే ఉన్నాం. అయినా ట్రంప్‌ మాత్రం తన పోకడను మార్చుకోవడం లేదు. ఓవైపు స్వదేశీ మార్కెట్‌లో చమురు ధరలు మైనస్‌లోకి చేరినా.. విదేశాల నుంచి తాము చమురు కొనే యోచనలో ఉన్నామని బీరాలు పలుకుతున్నారు. జాతీయ వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవడానికి 75 మిలియన్‌ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను కొనుగోలు చేయాలన్న తలంపుతో ఉన్నట్లు సోమవారం ట్రంప్‌ విలేకరుల సమావేశంలో అన్నారు. నిజానికి గతంలోనూ మరింతగా చమురును కొనాలని అమెరికా ఇంధన శాఖకు ట్రంప్‌ ఆదేశాలిచ్చారు. కానీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉన్నది. అమెరికాలో చమురు నిల్వ చేయడానికి ఇంధన సంస్థలు నానా కష్టాలు పడుతున్నాయి. మే మధ్య నాటికి సామర్థ్యాన్ని మించి చమురు నిల్వలు చేరేలా ఉన్నాయి. ఇదే కారణంతో సోమవారం డబ్ల్యూటీఐ ఫ్యూచర్‌ మార్కెట్‌ కుప్పకూలిందని అమెరికా వ్యూహాత్మక ఇంధన, ఆర్థిక పరిశోధన విభాగం అధ్యక్షుడు మైఖెల్‌ లించ్‌ తెలిపారు. ఈ క్రమంలో జూన్‌ కాంట్రాక్టులపైనా ట్రేడర్లలో ఆందోళనలు కనిపిస్తున్నాయి.

ఆవిరైపోయిన ముకేశ్‌ సంపద

దేశీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీ కోట్ల రూపాయల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు అలజడి కారణంగా స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభంలోనే ఆర్‌ఐఎల్‌ షేరు కుప్పకూలింది. దీంతో రూ.30 వేల కోట్ల వరకు నష్టపోయారు. చివరికి ఈ భారీ నష్టాలనుంచి కోలుకున్నారు. జనవరి 1 నుంచి మార్చి 23 వరకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర 39 శాతం పడిపోవడంతో ఆయన సంపద 34.4 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. తిరిగి మార్కెట్లు కుదుటపడటంతో ఏప్రిల్‌ 20 నాటికి ఆయన ఆస్తి 45 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని బ్లూంబర్గ్‌ బిలియనీర్ల ఇండెక్స్‌ వెల్లడించింది. 

‘కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నది. చైనాలోని ఓ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాలకూ విస్తరించింది. ప్రజల ప్రాణాల్నేగాక, దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ బలి తీసుకుంటున్నది. ఔషధమే లేని ఈ వైరస్‌ కట్టడికి నియంత్రణ ఒక్కటే మార్గం. దీంతో అన్ని ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. ఫలితంగా జనజీవనం, వ్యాపార, పారిశ్రామిక రంగాలు స్తంభించిపోయాయి. అన్ని రకాల రవాణా నిలిచిపోగా, ఇంధన వినియోగం భారీగా పడిపోయింది. ఇది చమురు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నది. అయితే అమెరికా మార్కెట్‌ భారత విపణిపై ప్రభావం చూపించే అవకాశాలు లేవు. ఇది ఫ్యూచర్‌ మార్కెట్‌ పతనం. భారత ప్రామాణికం బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 25 డాలర్ల వద్ద కదలాడుతున్నది. ఇది తగ్గితే మాత్రం దేశీయ మార్కెట్‌పై ప్రభావం ఉండొచ్చు’

- నరేశ్‌, వెలోసిటి సహ వ్యవస్థాపకుడు 


logo