EV Charging Stations | భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీతోపాటు వాడకం కూడా శరవేగంగా పెరుగుతున్నది. కానీ అందుకు తగిన నిష్పత్తిలో పబ్లిక్ విద్యుత్ వెహికల్స్ చార్జింగ్ స్టేషన్లు మాత్రం పెరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ నోడల్ ఏజెన్సీగా ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ గణాంకాల ప్రకారం దేశంలో 5,254 ప్రభుత్వ ఈవీ చార్జింగ్ పాయింట్లు మాత్రమే ఇప్పటి వరకు ఏర్పాటయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వాహన్ పోర్టల్ లెక్కల ప్రకారం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 20.65 లక్షలకు పైగా నమోదైంది.
కేవలం గతేడాదే 10 లక్షల ఎలక్ట్రిక్ వెహికిల్స్ అమ్ముడయ్యాయి. దీని ప్రకారం ప్రతి 393 ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఒక పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ అన్న మాట. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు సగటున ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంది. చైనాలోనైతే ఏడు ఎలక్ట్రిక్ వెహికల్స్కో చార్జింగ్ స్టేషన్ లభ్యం అవుతున్నది. ప్రముఖ రీసెర్చ్ ఏజెన్సీ `కౌంటర్ పాయింట్` ప్రకారం 2030 నాటికి దేశీయ అవసరాలకు అనుగుణంగా సుమారు 20.5 లక్షల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుత చార్జింగ్ స్టేషన్లతో పోలిస్తే తొమ్మిది రెట్లు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి.
కేంద్ర విద్యుత్‌శాఖ లెక్కల ప్రకారం అత్యధికంగా కర్ణాటకలో 774 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. తర్వాతీ స్థానంలో మహారాష్ట్రలో 660, ఢిల్లీలో 539, తమిళనాడులో 442 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 4.55 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయితే కేవలం 406 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం 1103 ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు ఒక పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ మాత్రమే అందుబాటులో ఉంది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, ఎలక్ట్రిక్ కార్ల కోసం చార్జింగ్ స్టేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది.
దేశంలో విద్యుత్ వాహనాల సేల్స్ నిరంతరం పెరుగుతున్నాయని సొసైటీ ఆఫ్ మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డైరెక్టర్ జనరల్ సోహిందర్ సింగ్ గిల్ చెప్పారు. దీంతో పోలిస్తే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ మంచి పబ్లిక్ చార్జింగ్ వసతులు, మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే.. ఎలక్ట్రిక్ వెహికిల్స్.. ప్రత్యేకించి కార్ల సేల్స్ మరింత పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయడానికి ప్రైవేట్ రంగంతో కలిసి పని చేయాలని ఈవీ టూ వీలర్ కంపెనీ ఎథేర్ ఎనర్జీ చార్జింగ్ ఇన్ఫ్రా బిజినెస్ హెడ్ అరవింద్ ప్రసాద్ తెలిపారు.