ముంబై, మార్చి 5: నిధులు లేక సతమతమవుతున్న బ్యాంక్‌లకు శుభవార్తను అందించింది రిజర్వుబ్యాంక్. బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులు చొప్పించడానికి సిద్ధమవుతున్నది. బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా సెక్యూరిటీల కొనుగోలు, డాలర్-రూపాయి స్వాప్ వంటి చర్యల ద్వారా నెల రోజుల వ్యవధిలో రూ.1.9 లక్షల కోట్ల నిధులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 28న 10 బిలియన్ డాలర్లకు సమానమైన డాలర్-రూపాయి వేలాన్ని నిర్వహించిన సెంట్రల్ బ్యాంక్..లిక్విడిటీని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఒపెన్ మార్కెట్ ద్వారా రూ.1 లక్షల కోట్లుకు సమానమైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయబోతున్నది. వీటిలో రూ.50 వేల కోట్ల చొప్పున ఈ నెల 12, 18న రెండు విడుతలుగా కొనుగోలు చేస్తున్నది.