Minister Sridhar Babu | హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): విదేశీ పెట్టుబడులే లక్ష్యం గా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు విదేశీ పర్యటనలకు బయలుదేరివెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి బయలుదేరి వెళ్లగా..ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మరో బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. ఈ నెల 4 నుంచి 11 వరకు జరగనున్న ఈ పర్యటనల్లో రూ.16 వేల కోట్లకు సంబంధించి విదేశీ పెట్టుబడుల ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నదని శ్రీధర్ బాబు వెల్లడించారు.
సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని శ్రీధర్‌బాబు వెల్లడించారు. సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో జరగనున్న కృత్రిమ మేథ గ్లోబల్ సమ్మిట్‌ను పురసరించుకొని ఐటీ విభాగం అధికారులు రూపొందించిన ఏఐ సమ్మిట్ వెబ్‌సైట్‌ను సచివాలయంలో ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం రూ.7 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, రూ.2.5 లక్షల కోట్లతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని వివరించారు.