WEF on Jobs | వచ్చే నాలుగేండ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 శాతం ఉద్యోగాల్లో మార్పులు తథ్యం.. అంటే 2023-27 మధ్య కాలంలో 6.9 కోట్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. `భవిష్యత్ ఉద్యోగాల నివేదిక-2023` అనే పేరుతో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సంచలన విషయాలు బయట పెట్టింది. ఇప్పటి ఉద్యోగాల్లో 8.3 కోట్ల కొలువులు కనుమరుగవుతాయని పేర్కొంది. ఈ దశాబ్ధి ప్రారంభంలో 2020లోనే కరోనా మహమ్మారితోపాటు ఆటోమేషన్ రూపంలో ఉపాధి కల్పన రంగంలో పెను సవాళ్లు ఎదురయ్యాయని తెలిపింది. ఉద్యోగాల తీరులో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వచ్చే ఐదేండ్ల పాటు ఈ మార్పులు స్థిరంగా సాగుతాయని స్పష్టం చేసింది. వచ్చే ఐదేండ్లలో 1.4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఇండియాలో 22 శాతం ఉద్యోగాలు పెరుగుతాయని పేర్కొంది.
వచ్చే ఐదేండ్లలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో 75 శాతం.. బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి అత్యాధునిక టెక్నాలజీలను అంది పుచ్చుకుంటాయి. కొత్త టెక్నాలజీలను తీసుకు రావడంతో ఐదేండ్లలో ఉద్యోగాల కల్పన నికరంగా పెరుగుతుందని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ప్రత్యేకించి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ నిపుణులకు భవిష్యత్లో గిరాకీ పెరుగుతుందని తెలిపింది.
సస్టెయినబుల్ ప్రొఫెషనల్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్టులు, సోలార్ పవర్ స్థాపన, వ్యవస్థల ఇంజినీర్లకు డిమాండ్ ఎక్కువ అవుతుంది. క్లరికల్, సెక్రటరీ హోదాలు నిర్వహించే వారికి కొన్నేండ్లలో అవకాశాలు తగ్గిపోతాయి. ఆటోమేషన్ వల్ల ప్రత్యేకించి బ్యాంకుల్లో టెల్లర్ సంబంధిత క్లర్క్లు, తపాలా శాఖలో క్లర్క్లు, క్యాషియర్లు, డేటా ఎంట్రీ క్లర్క్ కొలువులు తుడిచిపెట్టుకు పోతాయని పేర్కొంది డబ్ల్యూఈఎఫ్.
ఎడ్యుకేషన్, వ్యవసాయం, డిజిటల్ కామర్స్, వాణిజ్య రంగాల్లో ఉద్యోగాలు పెరిగితే, సంప్రదాయ సెక్యూరిటీ, ఫ్యాక్టరీ, వాణిజ్య రంగాల్లో కొలువులు తగ్గిపోతాయని డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ఉద్యోగాలకు విశ్లేషణ, సృజనాత్మకత కీలక నైపుణ్యంగా మారుతుందని తెలిపింది. 2028 నాటికి 44 శాతం మంది ఉద్యోగుల నైపుణ్యానికి కాలం చెల్లిపోతుందని వివిధ రంగాల కంపెనీల యాజమాన్యాలు తెలిపాయి. 2027 నాటికి ప్రతి పది మందిలో ఆరుగురికి నైపుణ్యంలో శిక్షణ అవసరం అయినా.. సగం మందికి మాత్రమే సరైన నైపుణ్యం అందుకునే అవకాశాలు లభిస్తాయని డబ్ల్యూఈఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. 800కి పైగా కంపెనీల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ ఈ నివేదిక సమర్పించింది.