హైదరాబాద్, ఫిబ్రవరి 27: గేమింగ్ కంపెనీ 1312 ఇంటరాక్టివ్.. దేశీయంగా తొలి పీసీ, కన్సోల్ గేమ్ పబ్లిషింగ్ హౌజ్‌ను ప్రారంభించింది. గేమింగ్ ఎక్స్పర్ట్స్ దీపక్ గురిజాల, రవితేజ మంతెన స్థాపించిన ఈ సంస్థ.. అంతర్జాతీయ ఆడియన్స్ కోసం ప్రపంచ శ్రేణి ఇండీ, ఏఏ గేమ్స్‌ను కనిపెట్టి, పబ్లిష్ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు గురువారం ప్రకటించింది. కాగా, తమ ప్రీ-సీడ్ ఫండింగ్ రౌండ్‌ను విజయవంతంగా పూర్తిచేశామని ఈ సందర్భంగా వ్యవస్థాపకులు తెలిపారు. ఇక ఈ ఏడాదికిగాను మార్కెట్లోకి తేవాలనుకున్న గేమ్స్‌ను ఇప్పటికే ఆవిష్కరించామని కూడా చెప్పారు. ఈ క్రమంలోనే ఏటా 6-8 గేమ్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేయాలని నిర్ణయించకున్నట్టు వారు వివరించారు.
ఇందులోభాగంగానే దేశవ్యాప్తంగా గేమ్ స్టూడియోలు, మార్కెట్, పబ్లీషింగ్ బలోపేతంపై దృష్టి పెడుతున్నారు. ‘మా లక్ష్యం భారతీయ గేమ్స్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే. ఆగ్నేయాసియా దేశాల్లోని గేమ్ డెవలపర్లతో కలిసి అవకాశాలను అన్వేషిస్తున్నాం’ అని తమ కొత్త వెంచర్ గురించి మాట్లాడుతూ దీపక్, రవితేజ తెలియజేశారు. కాగా, ఇండివీడ్యువల్స్ డెవలప్ చేసే వీడియో గేమ్‌లే ఇండీ గేమ్స్. ప్రొఫెషనల్స్ అభివృద్ధిపర్చే గేమ్‌లే ఏఏ గేమ్స్. ఇటీవలికాలంలో వీటికి మార్కెట్లో భారీగా డిమాండ్ కనిపిస్తున్నది. దీంతో కొత్త టెక్నాలజీతో రకరకాల వీడియో గేమ్స్ వస్తున్నాయి.