IPO | న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశించేందుకు కంపెనీలు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం క్యూ కడుతున్నాయి. సోమవారం ఒక్కరోజే మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీకి 13 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి మరి. దాఖలైన ప్రిలిమినరీ పేపర్స్ వివరాల ప్రకారం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల ద్వారా ఇవన్నీ రూ.8,000 కోట్ల నిధులను సమీకరించనుండగా, వీటిలో 4 కంపెనీల వాటానే సగం (రూ.4,000 కోట్లు)గా ఉండటం గమనార్హం. వ్యాపార విస్తరణ, రుణ భారం తగ్గింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ప్రస్తుత భాగస్వాముల వాటాల తగ్గింపు లక్ష్యాలతో ఈ పబ్లిక్ ఇష్యూలకు సంస్థలు లైన్ కడుతున్నాయి.
ఐపీవోకు రావాలని చూస్తున్న కంపెనీలు ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గాల ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే విక్రమ్ సోలార్ ఐపీవో విలువ రూ.1,500 కోట్లదాకా ఉంటే, ప్రమోటర్ల ద్వారా 1.74 కోట్ల వరకు షేర్లను ఓఎఫ్ఎస్లో అమ్మనున్నారు. ఇక ఆదిత్యా ఇన్ఫోటెక్ ఐపీవో రూ.1,300 కోట్లుగా ఉన్నది. ఫ్రెష్ ఇష్యూ రూ.500 కోట్లుగా, ఓఎఫ్ఎస్ రూ.800 కోట్లుగా ఉన్నాయి. వరిందెర కన్స్ట్రక్షన్స్ ఐపీవో విలవు రూ.1,200 కోట్లు. ఫ్రెష్ ఇష్యూ రూ.900 కోట్లు, ఓఎఫ్ఎస్ రూ.300 కోట్లుగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈపీసీ కంపెనీ విక్రాన్ ఇంజినీరింగ్ ఐపీవోలో రూ.900 కోట్లు ఫ్రెష్ ఇష్యూ. మరో 100 కోట్లను ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ మార్గంలో ఈక్విటీ షేర్లను అమ్మనున్నారు.
ఐపీవోల ద్వారా ఈ ఏడాదిలో ఇప్పటిదాకా దాదాపు రూ.64,000 కోట్ల నిధులను 62 సంస్థలు సమీకరించాయి. నిరుడుతో పోల్చితే 29 శాతం అధికం. గత ఏడాది మొత్తంగా 57 కంపెనీలు రూ.49,436 కోట్ల నిధులను సేకరించాయి. అయితే ఈ ఏడాది ఆఖర్లోగా హ్యుందాయ్ మోటర్ ఇండియా, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ తదితర అరడజనుకుపైగా సంస్థలు ఐపీవోకు రావాలని చూస్తున్నాయి. ఇదే జరిగితే వీటన్నిటి విలువ రూ.60,000 కోట్లుగా ఉండనున్నది. దీంతో ఈ ఏడాది ఐపీవోల ద్వారా సమీకరించిన మొత్తాల విలువ సుమారుగా రూ.1.25 లక్షల కోట్లకు చేరనున్నది. ఒక్క హ్యుందాయ్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ విలువే రూ.25,000 కోట్లుగా ఉండనున్నది. ఇది కార్యరూపం దాల్చితే దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోగా రికార్డు సృష్టించనున్నది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్రానైట్ సంస్థ మిడ్వెస్ట్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. రూ.650 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. కరీంనగర్లో అతిపెద్ద బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ప్లాంట్ను నిర్వహిస్తున్నది. తాజా షేర్లను జారీ చేయడంతో రూ.250 కోట్లను, ప్రమోటర్లకు చెందిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనుండటంతో మరో రూ.400 కోట్లు సేకరించాలని నిర్ణయించింది.
స్టాక్ మార్కెట్లలో పెద్ద ఎత్తున ఐపీవో సందడి కనిపిస్తున్నది. దేశ ఆర్థికాంశాలతోపాటు, ఆయా రంగాలవారీగా పలు విషయాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా ఇదే జోష్.
-మునీశ్ అగర్వాల్, ఈక్విరస్ గ్రూప్