హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలకు దన్నుగా నిలుస్తున్నది. వారికిస్తున్న చేయూత సత్ఫలితాల్ని అందిస్తున్నది. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ పార్కులో పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. ఈ ఇండస్ట్రియల్ పార్కును మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేకంగా కేటాయించారు. స్త్రీలు స్వశక్తితో ఎదగడమే కాకుండా ఉపాధి కల్పనలోనూ భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు చొరవ తీసుకొని ఈ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికి సహకారం అందించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మహిళా దినోత్సవంనాడు కేటీఆర్ ఈ పార్కును ప్రారంభించారు.
శరవేగంగా మౌలిక వసతులు
ఈ పారిశ్రామిక వాడలో ప్రభుత్వం శరవేగంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. రహదారులు, విద్యుత్తు, నీరు, డ్రైనేజీ ఇతర వసతులను ఏర్పాటు చేయగా, పరిశ్రమల నిర్మాణం జోరందుకున్నది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం రవాణా సౌకర్యం కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరినట్టు ఎఫ్ఎల్వో కార్యనిర్వాహక సభ్యురాలు జ్యోత్స్న అంగారా తెలిపారు.
ఈ ఏడాది మార్చిలోనే 5 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయని, ఆ తర్వాత మరో 7 కంపెనీలు కార్యకలాపాలు మొదలుపెట్టాయని ఆమె చెప్పారు. నేడు మహిళలు పూర్తిస్థాయిలో తయారీ రంగంతోపాటు ఇతర రంగాల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఎదిగారని ఈ సందర్భంగా జ్యోత్స్న ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇక్కడి సంస్థల్లో ఉద్యోగులుగా మహిళల్నే తీసుకోవాలని చూస్తున్నట్టు చెప్పారు.
ఏమేమి తయారవుతున్నాయంటే..?
ఫర్నీచర్, ఫ్యాన్లు, ప్యాకేజింగ్, జనరల్ ఇంజినీరింగ్, లిఫ్టులు, ఎలివేటర్లు, న్యూట్రాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, గార్మెంట్స్, మెడికల్ డివైజెస్ తదితర ఉత్పత్తులు తయారవుతున్నాయి. సృష్టి ప్రీకాస్ట్, యష్ ఇంటర్నేషనల్, సాల్జ్గిట్టర్ లిఫ్ట్ వంటి కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి.