న్యూఢిల్లీ, జనవరి 17: దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో భారీ స్థాయిలో ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10-12 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. గడిచిన రెండు త్రైమాసికాలుగా భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకున్న సంస్థ..మూడో త్రైమాసికంలో 1,157 మంది సిబ్బంది తగ్గారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,32,732కి పరిమితమైనట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్రతి త్రైమాసికంలో 2,500-3,000 మంది ఫ్రెషర్లు ఆన్‌బోర్డ్‌లో ఉంటున్నారని కంపెనీ మానవ వనరుల ప్రతినిధి సౌరభ్ గోవిల్ తెలిపారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,354 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 24.4 శాతం ఎగబాకింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.22,319 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.