న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఈ ఏడాది జూన్ నెలలో దేశంలో టెలికం చందాదారుల సంఖ్య 117.39 కోట్లకు పెరిగింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో 117.26 కోట్లున్న టెలికం కనెక్షన్ల సంఖ్య జూన్లో స్వల్పంగా అధికమయ్యింది. రిలయన్స్ జియో 22.7 లక్షలు, భారతి ఎయిర్టెల్ 14 లక్షల మొబైల్ కనెక్షన్లను జతచేయడంతో మొత్తం టెలికం చందాదారుల సంఖ్య నెలవారీగా 0.11 శాతం పెరిగిందని ట్రాయ్ నివేదిక తెలిపింది. అయితే జూన్ నెలలో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, వొడాఫోన్ఐడియాలు భారీగా మొబైల్ చందాదారుల్ని కోల్పోయారు. బీఎస్ఎన్ఎల్ 18.7 లక్షలు, ఎంటీఎన్ఎల్ 1.53 లక్షలు, వొడాఫోన్ఐడియా 12.8 లక్షల చొప్పున మొబైల్ కనెక్షన్లను నష్టపోయాయి. మొత్తం మీద జూన్ నెలలో నికరంగా 3.74 లక్షల మంది వైర్లెస్ చందాదారులు పెరిగారు. దీంతో వీరి సంఖ్య 114.32 కోట్లకు చేరుకుంది.
పెరిగిన వైర్లైన్ కనెక్షన్లు
మే నెలలో స్వల్పంగా తగ్గిన వైర్లైన్ టెలికం కనెక్షన్లు జూన్లో పెరిగాయి. రిలయన్స్ జియో 2.08 లక్షలు, భారతి ఎయిర్టెల్ 1.34 లక్షలు, వీ-కాన్ మొబైల్ 13,100, టాటా టెలి 12,617 చొప్పున కొత్త వైర్లైన్ కనెక్షన్లను జూన్లో సాధించాయి. బ్రాడ్ బ్యాండ్ సబ్స్క్రయిబర్ల సంఖ్య 86.14 లక్షలకు పెరిగినట్టు ట్రాయ్ డాటా వెల్లడిస్తున్నది.