హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రమాద బీమా అంటే రోడ్డు, వాహన ప్రమాదాలు జరిగితేనే వర్తిస్తుందనేది అందరి నమ్మకం. కానీ ఏ రకమైన ప్రమాదం జరిగినా బీమా వర్తింపజేసే రెండు పథకాలను పోస్టల్ శాఖ తీసుకొచ్చింది. ప్రతి ఏటా రూ.299 లేదా రూ.399 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల బీమా మొత్తం చెల్లించే రెండు వేర్వేరు పాలసీలను ప్రవేశపెట్టింది. ఇది ప్రస్తుతమున్న బీమా పాలసీలకు భిన్నంగా ఉంటుందని పోస్టల్‌శాఖ అధికారులు చెప్తున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా చేయించుకునే వారి సంఖ్య పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగతంతోపాటు ఫ్యామిలీ ప్యాకేజీ బీమాను కూడా అందజేస్తున్నామని వివరించారు. ఇందుకోసం పోస్టల్ శాఖ టాటా ఏఐజీతో కలిసి పనిచేస్తున్నది. ఈ పాలసీ తీసుకోవాలనుకొనేవారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ఖాతాను తెరవాల్సి ఉంటుంది.
రూ.399 ప్రీమియం పాలసీలో బెనిఫిట్స్..
ప్రతి సంవత్సరం రూ.399 ప్రీమియం చెల్లించి పాలసీలో చేరిన వారికి దాదాపు 10 రకాల ప్రయోజనాలను కల్పిస్తున్నారు. ఏదైనా ప్రమాదంలో మరణించినా, శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందినా, పక్షవాతం వచ్చినా, అంగ ఛేదం జరిగినా రూ.10 లక్షల వరకు చెల్లిస్తారు. అంత్యక్రియల కోసం రూ.5వేలు, పాలసీదారుడి పిల్లలకు చదువు కోసం రూ.లక్ష పరిహారం అందిస్తారు. ఒకవేళ గాయపడి ఇన్‌పేషెంట్‌గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు, అవుట్ పేషెంట్ (ఓపీడీ)గా చికిత్స తీసుకొంటే రూ. 30వేలు చెల్లిస్తారు. దవాఖానలో రోజూవారి నగదు కింద 10 రోజుల వరకు ప్రతిరోజు రూ.వెయ్యి చెల్లిస్తారు. దీనితో పాటు రవాణా ఖర్చుల కింద రూ.25వేలు మించకుండా (వాస్తవ ఖర్చులు) అందజేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
రూ.299 ప్రీమియం పాలసీ సౌకర్యాలు
రూ.299 ప్రమాద రక్షణ బీమాలో కూడా శాశ్వత పాక్షిక అంగవైకల్యం చెందినా, పక్షవాతం వచ్చినా, అంగ ఛేదం జరిగినా రూ.10 లక్షల వరకు చెల్లిస్తారు. ఒకవేళ గాయపడి ఇన్‌పేషెంట్‌గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు, అవుట్ పేషెంట్ (ఓపీడీ)గా చికిత్స తీసుకొంటే రూ. 30వేలు చెల్లిస్తారు. ఇవి మినహా అంత్యక్రియల ఖర్చులు, పిల్లల చదువుకోసం ఇచ్చే డబ్బు, రవాణా ఖర్చులు, బెడ్ ఖర్చులు వంటివి ఈ పథకంలో లేవు.
అనూహ్య స్పందన వస్తున్నది
తపాలాశాఖలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రికరింగ్ డిపాజిట్ వంటి అనేక పాలసీలు ఉన్నాయి. అయితే ఇటీవల వచ్చిన రూ.399, రూ.299 వార్షిక ప్రీమియం చెల్లించే ప్రమాద బీమాకు అనూహ్య స్పందన వస్తున్నది. పాము కాటుతో మరణించినా, అంగవైకల్యం కలిగినా, విద్యుత్తుషాక్‌తో మరణించినా బీమా వర్తిస్తుంది. తక్కువ ప్రీమియంతోపాటు ఇతర సదుపాయాలు కల్పించడంతో ప్రజలు అధికసంఖ్యలో బీమా చేయించుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. పాలసీదారుడి వయస్సు 18 నుంచి 65 ఏండ్ల మధ్య ఉండాలి. వివరాలకు స్థానిక తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలి.
– జీబీ సత్యేంద్ర కృష్ణ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ నార్త్ డివిజన్