SCS | ఆర్థిక ప్రణాళికలో పొదుపు, పెట్టుబడులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అవగాహన, వివేకంతో ముందుకెళ్తే ఆకర్షణీయ స్థాయిలో రాబడులను పొందవచ్చు. ఇక సాధారణ సిటిజన్స్‌తో చూస్తే సీనియర్ సిటిజన్ల పెట్టుబడులకున్న 10 అత్యుత్తమ మార్గాలను ఒక్కసారి పరిశీలిస్తే వాటిలో..
పదవీ విరమణ పొందినవారు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల గురించే ఆరా తీస్తూ ఉంటారు. సురక్షిత, స్థిరమైన ఆదాయ వనరును కోరుకుంటారు. అలాంటి వాటిలో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం (ఎస్సీఎస్ఎస్) ఒకటి. ఇదో కేంద్ర ప్రభుత్వ పథకం. పూర్తిగా రిస్క్ లేని రుణ సాధనం. 60 ఏండ్లు, ఆపై వయసువారి కోసమే తెచ్చారు. ప్రస్తుత వడ్డీరేటు 8.20 శాతం. ప్రతీ 3 నెలలకోసారి సవరిస్తారు. కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్ఠం రూ.30 లక్షలు. ఈ స్కీం గరిష్ఠ పరిమితి 5 ఏండ్లు. ఈ పెట్టుబడి మొత్తాలు పన్ను పరిధిలోకి రావు. అయితే వీటిపై పొందే వడ్డీ ఆదాయం వారివారి ఐటీ స్లాబుల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.
తపాలా శాఖ అందించే ఈ స్కీంలో పెట్టుబడులకుగాను నెలనెలా నిర్ణీత స్థాయిలో వడ్డీ ఆదాయాన్ని పొందవచ్చు. రిటైర్మెంట్ వయసులో ఆర్థిక భద్రతకు చక్కని అవకాశం. అయితే సీనియర్ సిటిజన్లకే కాదు.. 10 ఏండ్లు దాటిన భారతీయ పౌరులెవరైనా ఇందులో పెట్టుబడులకు దిగవచ్చు. దీని వార్షిక వడ్డీరేటు 7.40 శాతంగా ఉన్నది. ప్రతీ 3 నెలలకోసారి మారడానికి ఆస్కారం ఉన్నది. కనీస పెట్టుబడి రూ.1,500. గరిష్ఠ పెట్టుబడి రూ.4.5 లక్షలు. జాయింట్ అకౌంట్లో రూ.9 లక్షలదాకా పెట్టుబడులు పెట్టవచ్చు. కాలపరిమితి 5 ఏండ్లు. ఆ తర్వాత మరో 5 ఏండ్లు కూడా పొడిగించుకోవచ్చు. వడ్డీ ఆదాయంపై పన్నులుంటాయి.
రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్లే (ఎఫ్డీ) ఇవి. బ్యాంకుల్లో సాధారణ పౌరులతో పోల్చితే సీనియర్ సిటిజన్లకు ఆయా కాలపరిమితుల ఎఫ్డీలపై వడ్డీరేట్లు ఎక్కువగా లభిస్తాయి. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఎఫ్డీలలో పెట్టుబడులకు పన్ను మినహాయింపున్నది. ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదా చేసుకోవచ్చు. అలాగే నెలవారీగా, 3 నెలలవారీగా, వార్షిక ప్రాతిపదికన నగదునూ పొందవచ్చు. మార్కెట్ రిస్క్‌లకు దూరంగా ఉంటూ సురక్షితమైన పెట్టుబడులను, స్థిరమైన ఆదాయాన్ని ఆశించేవారు ఈ ఎఫ్డీలను పరిశీలించవచ్చు.
సిస్టమ్యాటిక్ డిపాజిట్ ప్లాన్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఫీచర్లుంటాయి. ఒకేసారి పెద్ద మొత్తాల్లో డిపాజిట్లకు బదులు చిన్నచిన్న మొత్తాల్లోనూ డిపాజిట్లకు ఇందులో వీలుంటుంది. నెలనెలా మనం చేసే ప్రతీ డిపాజిట్‌ను ఓ ఎఫ్‌డీగానే చూస్తారు. తక్కువలో తక్కువగా రూ.5వేలతో ఈ మంత్లీ డిపాజిట్లను ప్రారంభించవచ్చు. ఇక ఇందులో రెండు వేరియంట్లుంటాయి. ఒకటి సింగిల్ మెచ్యూరిటీ స్కీం, మరొకటి మంత్లీ మెచ్యూరిటీ స్కీం. వార్షిక వడ్డీరేట్లు 8.50 శాతందాకా ఉన్నాయి. ఏడాది నుంచి ఐదేండ్ల కాలపరిమితితో పెట్టుబడులు పెట్టవచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీం. పదవీ విరమణ కాలంలో స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటుంది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని ఉద్యోగులకు ఇది చక్కని పథకమనే చెప్పవచ్చు. ఉద్యోగుల నుంచి, వారి సంస్థల తరఫు నుంచి ఇందులోకి నగదు జమవుతుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద పన్ను ప్రయోజనాలు దక్కుతాయి.
60 ఏండ్లు, ఆపై వయసున్నవారికి రెగ్యులర్ ఇన్‌కమ్‌ను అందించడానికి వచ్చినదే ఈ సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) స్కీం. బ్యాంకులనుబట్టి డిపాజిట్లకున్న కనీస, గరిష్ఠ పరిమితులు ఆధారపడి ఉంటాయి. కాలపరిమితి 7 రోజుల నుంచి 10 ఏండ్లదాకా ఉంటుంది. వార్షిక వడ్డీరేట్లు 9.75 శాతం వరకున్నాయి. అత్యవసర పరిస్థితిలో ఎఫ్డీని వెనక్కి తీసుకోవచ్చు. అయితే జరిమానాలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎఫ్‌డీల తనఖాపై రుణాలనూ పొందవచ్చు. మీ డిపాజిట్లపై రుణ మొత్తాలు ఆధారపడి ఉంటాయి. రూ.50వేలదాకా పన్ను మినహాయింపుంటుంది.
ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో పెట్టుబడి పెట్టేవారికి చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ రంగ కార్యక్రమాలు, ప్రభుత్వ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు ఈ బాండ్లను ప్రభుత్వం తరఫున జారీ చేస్తాయి. కాబట్టి ఇదో భద్రత కలిగిన పెట్టుబడి సాధనం.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్) అనేది ఓ ట్యాక్స్-సేవింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీం. స్టాక్ మార్కెట్లు లేదా వాటి సంబంధిత సాధనాల్లో పెట్టుబడులను పెట్టడం జరుగుతుంది. అయితే ఇందులో రిస్క్ ఉంటుందన్న విషయం మరువద్దు. అయినప్పటికీ వేచిచూస్తే పెట్టుబడులపై మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చు. తక్కువ రిస్కుతో ఎక్కువ రాబడులను అందుకోవచ్చు మరి. ఇక ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే వీటిల్లో లాకిన్ పీరియడ్స్ ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడులు పెట్టే ముందే సంబంధిత డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం మంచిది. నిజానికి రిస్క్‌లకు దూరంగా ఉండాలనుకునే మదుపరులకు ఇవి పనికిరావు. ఈక్విటీ, రుణ మార్కెట్లలో మీ సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడమే ఇందుకు కారణం. అయితే ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంలో ఆకర్షణీయ రాబడులనే అందిస్తాయని చెప్పవచ్చు. కాబట్టి నిపుణుల సలహా మేరకు మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్స్‌కూ కొంత భాగం ఇవ్వవచ్చు. లాభాలపై మూలధన లాభాల పన్నులుంటాయి.
సీనియర్ సిటిజన్లకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కూడా ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఇదో సురక్షిత పెట్టుబడి మార్గం. పీపీఎఫ్‌ల్లో పెట్టుబడి ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదాకు అవకాశాన్నిస్తుంది. పీపీఎఫ్ ఖాతా పరిమితి 15 ఏండ్లు.