
హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన మౌలిక రంగ సంస్థ విశ్వ సముద్ర ఇంజినీరింగ్…ఆర్డర్లు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులను చేజిక్కించుకున్న కంపెనీ చేతిలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ యెండ్లూరి తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో ఇప్పటికే చాలా వరకు పనులు చేపట్టినట్లు, మరికొన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిలో రూ.3,600 కోట్ల విలువైన పనులు కేరళలోని కన్నూరు, కొల్లామ్లలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించినవన్నారు. తాము బయటినుంచి ఎటువంటి రుణాలు తీసుకోకుండానే పూర్తిగా కంపెనీకి సంబంధించిన అంతర్గత నిధులతోనే పనులు చేపడుతున్నట్లు, భవిష్యత్తులో విమానాశ్రయాలు, ఓడరేవులు, రైల్వేలు, మెట్రో రైలు ప్రాజెక్టుల వంటి రంగాల్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రూ.500-550 కోట్ల స్థాయిలో ఆదాయం ఆర్జించింది. తక్కువ ఖర్చుతోపాటు సమయం ఆదా అయ్యే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కంపెనీ ప్రత్యేకత. సాంప్రదాయ పద్ధతుల్లో ఒక కిలోమీటరు సింగిల్ లేన్ రోడ్డు నిర్మాణానికి 12-15రోజులు పడితే తాము చేపట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 15గంటల్లోనే నిర్మించవచ్చన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో తాము హైదరాబాద్లో ఎన్టీఆర్ మార్క్, ఏఎస్రావు నగర్లో రోడ్లను నిర్మించామన్నారు.