న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఉద్యోగార్థులు దాఖలు చేసే ప్రతి 10 దరఖాస్తుల్లో ఒకటికిపైగా తప్పుడు సమాచారంతోనే ఉంటున్నాయని ఓ తాజా నివేదికలో తేలింది. వేతనం, అనుభవం, గత సంస్థల నుంచి ఎందుకు బయటకు వచ్చారు? వంటి వివరాల్లో దరఖాస్తుదారులు అసలు నిజం చెప్పట్లేదని బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆథ్‌బ్రిడ్జ్ తమ రిపోర్టులో పేర్కొన్నది.
గత ఆర్థిక సంవత్సరం (2025-26) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో నకిలీ సర్టిఫికెట్లు, డిగ్రీలతోపాటు యూజీసీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ఇన్స్టిట్యూషన్లను పేర్కొనడం సర్వసాధారణంగా కనిపించిందంటూ ‘వర్క్‌ఫోర్స్ ఫ్రాడ్ ఫైల్స్’ పేరిట రూపొందించిన ఈ నివేదిక స్పష్టం చేసింది. కాగా, ఇన్-హౌస్ వెరిఫికేషన్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించి గత ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య లక్షలాది వైట్ కాలర్, గిగ్ వర్కర్స్ డాటాను పరిశీలించామని ఆథ్‌బ్రిడ్జ్ వ్యవస్థాపక సీఈవో అజయ్ ట్రెహాన్ ఈ సందర్భంగా వెల్లడించారు.