ముంబై, ఏప్రిల్ 3 : ‘ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. భారత్‌ను ప్రభావితం చేస్తున్నది. అవును.. పశ్చిమాసియాలో మొదలైన ఈ సంక్షోభం.. ఇప్పుడు యావత్తు ప్రపంచానికి విస్తరిస్తున్నది. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థపైనున్న అంచనాలను తారుమారు చేస్తున్నది. ఈ క్రమంలోనే గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ రేటు 100 డాలర్ల ఎగువన స్థిరపడితే.. దేశంలో ద్రవ్యోల్బణం విజృంభించడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గల్ఫ్ ఉద్రిక్తతలతో పీపా ముడి చమురు ధర అంతర్జాతీయ విపణిలో ఇప్పటికే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న విషయం తెలిసిందే. యుద్ధం తీవ్రత తగ్గినప్పుడు రేట్లు పడిపోవడం, పెరిగినప్పుడు ధరల ఎగబాకడం ఇటీవలికాలంలో తరచూ జరుగుతూనే ఉన్నది. ఇలా బ్యారెల్ విలువ 120 డాలర్లను సమీపించిన సందర్భం కూడా ఏర్పడింది. అయితే 100 డాలర్లపైనే ధరలు స్థిరపడితే.. భారత్‌లో అన్నింటి ధరలకు రెక్కలు తొడుగుతాయని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ హెచ్ఎస్బీసీలోని ఆర్థికవేత్తలు అంటున్నారు.
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు.. చాలా దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే భారత్‌కు ఈ యుద్ధం సెగ మరింతగా తగులుతున్నది. ఇందుకు కారణం దేశీయ ఇంధన అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండటం. ఇందులో మెజారిటీ వాటా గల్ఫ్‌లోని సౌదీ అరేబియా తదితర దేశాల నుంచే వస్తున్నది. కానీ యుద్ధం దెబ్బకు అక్కడి నుంచి భారత్‌కు చమురు రవాణాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌కు మద్దతునిస్తున్నాయని ఇరాన్ తమ పొరుగు దేశాలైన యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాక్‌లపై దాడులు చేస్తున్నది. ఆయా దేశాల్లోని ముడి చమురు, సహజ వాయువు ఉత్పాదక కేంద్రాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తున్నది. ఫలితంగా పెద్ద ఎత్తునే నష్టం వాటిల్లుతున్నది. దీంతో క్రూడాయిల్, గ్యాస్ ఉత్పత్తి ఆగిపోతున్నది. మరోవైపు గల్ఫ్ దేశాలకు, భారత్ సహా ఇతర దేశాలకు చమురు, గ్యాస్ రవాణా కోసం వారధిగా ఉండే హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది.
ఆ మార్గం గుండా ప్రయాణించే నౌకలపై దాడులు చేస్తున్నది. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతున్నది. గ్లోబల్ మార్కెట్లో ఇది క్రూడాయిల్ ధరలను ఎగదోస్తున్నది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు 110 డాలర్ల సమీపంలో కదలాడుతున్నది. ఇక గల్ఫ్ దేశాల్లో ఇప్పుడప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ యుద్ధం ఆగినా.. ఇప్పటిదాకా జరిగిన నష్టాల నుంచి తేరుకుని సాధారణ స్థితికి చమురు, గ్యాస్ ఉత్పత్తి రావడానికి సమయం పడుతుందన్న అంచనాలే గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర పీపా 100 డాలర్లపైనే పలికితే.. భారత్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువకు చేరుతుందని హెచ్ఎస్బీసీ ఎకనామిస్టులు పేర్కొంటున్నారు. ఒకవేళ క్రూడ్ ధర తగ్గితే.. ద్రవ్యోల్బణం గణాంకాలూ తగ్గుతాయని అంటున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువనే ఉంచాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది. అయితే ఇరాన్ వార్తో ఆ స్థాయిని మించి ధరల సూచీ నమోదయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) రెపోరేటు 25-50 బేసిస్ పాయింట్లు పెరుగడం ఖాయమన్న అంచనాలైతే వస్తున్నాయి. కాగా, వచ్చే వారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్బీఐ చేపట్టనున్నది. ఈ క్రమంలో డాలర్‌తో పోల్చితే దారుణంగా పడిపోతున్న రూపాయి మారకం విలువను అడ్డుకోవడానికి ఆర్బీఐ వడ్డీరేట్లను వినియోగిస్తుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే రెపోరేటును పెంచితే.. వృద్ధిరేటుకు విఘాతమని మెజారిటీ ఎకనామిస్టులు చెప్తున్నారు. నిజానికి ఇటీవల రూపీ ఎక్సేంజ్ వాల్యూ తొలిసారి 95 మార్కును దాటింది. అయితే ఆర్బీఐ తీసుకున్న చర్యలతో తిరిగి కోలుకున్నది. ఈ క్రమంలో ఇప్పటికైతే తటస్థ వైఖరినే అవలంబిస్తూ కీలక వడీరేట్లను ఎక్కడివక్కడే ఉంచడం మంచిదన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వెలిబుచ్చుతున్నారు.
అయితే ద్రవ్యోల్బణం కట్టడికి రాబోయే ద్రవ్య సమీక్షల్లోనైనా వడ్డీరేట్లను ఆర్బీఐ తప్పక పెంచుతుందని క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడైన హిమాన్షు కోహ్లీ అంటున్నారు. దీంతో రాబోయే రోజుల్లో బ్యాంకులూ ఆ మేరకు తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచడం ఖాయమే. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణగ్రహీతలపై ఈఎంఐల భారం పెరుగనున్నదన్నమాట. అలాగే రుణ లభ్యత ప్రియమైతే రియల్టీ, ఆటో, వాటి అనుబంధ రంగాల్లో అమ్మకాలూ పడిపోయే ప్రమాదం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. యుద్ధం ప్రభావంతో ఒత్తిడిలో ఉన్న దేశ జీడీపీకి ఇది ఎంతమాత్రం క్షేమం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇరాన్ యుద్ధంతో భారత్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కూడా మందగిస్తుందని హిమాన్షు హెచ్చరిస్తున్నారు. నెల రోజులకుపైగా జరుగుతున్న ఈ యుద్ధం.. అనేక దేశాల ఆర్థిక వృద్ధిని ఆటంకపరుస్తున్నదని ఓ ప్రముఖ జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. యుద్ధం కొనసాగడం ఏ దేశానికీ మంచిది కాదన్న ఆయన.. పెరిగే ఉత్పాదక, రవాణా వ్యయాలు అనేక సవాళ్లకు దారితీస్తాయని ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. వినిమయ, కొనుగోలు శక్తి క్షీణించి, ఉద్యోగ-ఉపాధి అవకాశాల్లేక యావత్తు మార్కెట్లో నిస్తేజం ఆవరిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.