రామ్‌చరణ్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’లో అచ్చియ్యమ్మ పాత్రలో జాన్వీకపూర్ కనిపించనున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది. జాతీయ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో జాన్వీకపూర్ ‘పెద్ది’లో తన పాత్ర తాలూకు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. అందరినీ శాసిస్తూ కాస్త పొగరుతో కూడిన పాత్ర ఇదని, ఎంతో ఇష్టపడి అచ్చియ్యమ్మ పాత్రను చేశానని ఆనందం వ్యక్తం చేసింది. ‘సాధారణంగా పల్లెటూరు అమ్మాయిలు అమాయకంగా, బిడియంతో కనిపిస్తారు. కానీ అచ్చియమ్మ పాత్ర మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. అందరి మీద ఆధిపత్యం చలాయిస్తూ హుషారైన అమ్మాయిగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నా ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. హీరోల ఇంట్రడక్షన్ తరహాలో భారీ సెటప్‌తో డిజైన్ చేశారు’ అని జాన్వీకపూర్ చెప్పింది.