ఈ మధ్యకాలంలో క్యాన్సర్ రోగుల విషయంలో, ఇతర సందర్భాల్లో ఎక్కువగా వినిపిస్తున్న శస్త్రచికిత్స ప్లాస్టిక్ సర్జరీ. సాధారణంగా కాలిన గాయాలకు గురైనవారు, రోడ్డుప్రమాదాలు, విద్యుదాఘాతాలకు గురైన బాధితుల్లో కొంతమందికి గాయాల వల్ల రూపం చెదిరిపోతుంది. శరీరంలోని చర్మం, కండ, టిష్యూలు పూర్తిగా దెబ్బతినడం వల్ల ఎముకలు బయటికి తేలుతాయి. సకాలంలో సరైన చికిత్స అందించకపోతే రోగి ప్రాణాలకే ప్రమాదం. కాలిన గాయాలకు,రోడ్డు ప్రమాదాల్లో అవయవాలు దెబ్బతిన్న బాధితులకు చికిత్సలో భాగంగా స్కిన్గ్రాఫ్టింగ్ లేదా స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ‘రీ కన్స్ట్రక్టివ్ ఫ్లాప్’ శస్త్రచికిత్స సైతం అవసరం పడుతుంది.
తన సహజ రూపం కోల్పోయిన రోగికి ఈ చికిత్సల్లో ప్రతిరూపాన్ని ఇవ్వడంతోపాటు దెబ్బతిన్న అవయవాలు తిరిగి పనిచేసే విధంగా ప్లాస్టిక్ సర్జరీ వైద్యనిపుణులు చికిత్స చేస్తారు. అగ్ని ప్రమాదాలకు గురైన వారికీ, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారందరికీ స్కిన్ గ్రాఫ్టింగ్, రీకన్స్ట్రక్షన్ చేయాల్సిందేనా, ఏయే సందర్భాల్లో ఈ చికిత్స అవసరం పడుతుంది, చికిత్సా విధానాలు, జాగ్రత్తలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
వైద్యశాస్త్రంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా.. దేవుడిచ్చిన సహజ రూపం ఒక్కసారి చెదిరిపోతే తిరిగి పొందలేం. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రమాదాలబారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల్లో రూపాన్ని కోల్పోయిన వారికి మాత్రం ప్రతిగా మరో రూపం ఇవ్వొచ్చు అంటున్నారు వైద్యులు. మనిషి శరీరానికి చర్మం అనేది ఒక రక్షణ కవచం. అది లేకపోతే మనిషి బతకడం కష్టం. అగ్ని ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాల్లో చర్మం కాలిపోయినా లేదా దెబ్బతినడం వల్ల శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్ తదితర ఫ్లూయిడ్స్ బయటికి వచ్చేస్తాయి. 15 శాతం కంటే ఎక్కువగా ఫ్లూయిడ్స్ బయటికి పోతే రోగి షాక్‌లోకి వెళ్లి మృతిచెందే ప్రమాదమూ ఉంది.
కాలిన గాయాల శాతాన్ని అవయవాల ఆధారంగా లెక్కిస్తారు. శరీరాన్ని 11 భాగాలుగా విభజించారు. అందులో ఒక్కో భాగాన్ని 9 శాతంగా పరిగణిస్తారు. హెడ్ అండ్ నెక్ అంటే తల, ముఖ భాగం కాలిపోతే దానిని 9 శాతంగా లెక్కిస్తారు. ఛాతీ భాగం కాలితే 9 శాతం, పొత్తికడుపు కాలితే 9 శాతం ఇలా అవయవాల ఆధారంగా కాలిన శాతాన్ని లెక్కిస్తారు. 11 అవయవ భాగాలు కాలిన గాయాలకు గురైతే 99 శాతం కాలినట్లు పరిగణిస్తారు. జనిటెల్ ఏరియా అంటే జననేంద్రియాలు కాలితే 1 శాతంగా లెక్కిస్తారు. అంటే శరీరంలోని అవయవాలన్నీ కలిపి 100 శాతంగా పరిగణిస్తారు. 30 శాతం కంటే ఎక్కువగా కాలిన గాయాలకు గురైతే వారు ప్రమాదపు అంచున ఉన్నట్లే.
కాలిన గాయాల శాతాన్ని పైన పేర్కొన్న విధంగా అవయవాల ఆధారంగా లెక్కిస్తారు. అయితే చికిత్సను మాత్రం గాయం లోతు ఆధారంగా నిర్ణయిస్తారు. 2 లేదా 3 డిగ్రీల కంటే ఎక్కువ గాయాలైతే వారికి స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్, అవసరానికి అనుగుణంగా రీకన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. గాయం ఎంత లోతుగా ఉందనేదాన్ని వైద్యులు తమ అనుభవం మేరకు గుర్తిస్తారు.
మనిషి శరీరంపై రెండు పొరలు ఉంటాయి. అందులో ఒకటి బాహ్యపొర. దీనినే వైద్యపరిభాషలో ‘ఎపిడెర్మిస్’ అంటారు. రెండోది లోపలి పొర. దీనిని ‘డెర్మిస్’ అంటారు. బాహ్యపొర కాలిపోతే దానిని 1 డిగ్రీగా పరిగణిస్తారు. డెర్మిస్ పొర పాక్షికంగా కాలితే 2 డిగ్రీలు గాను, పూర్తిగా కాలిపోతే 3 డిగ్రీలుగా పరిగణిస్తారు.
ఒక డిగ్రీ కాలిన వారికి మూడు రకాలుగా చికిత్స అందిస్తారు. అందులో ఒకటి స్కిన్ సబ్స్టిట్యూట్స్ లేదా కొలాజిన్ (కృత్రిమ చర్మం పొర) వేసి చికిత్స అందిస్తారు. రెండో పద్ధతిలో స్పెషల్ మెడికేషన్ ఫోమ్ డ్రెస్సింగ్ ద్వారా, మూడో పద్ధతిలో ఆయింట్మెంట్స్ ద్వారా చికిత్స చేస్తే సరిపోతుంది. ఒక డిగ్రీ కాలిన గాయాలకు గురైన రోగి రెండు వారాల్లో కోలుకునే అవకాశాలుంటాయి.
కాలిన గాయాలతో పాటు విద్యుదాఘాతం, యాసిడ్ దాడులు, యంత్రాల్లో, రోడ్డు ప్రమాదాల్లో అవయవాలు క్రష్ కావడం వల్ల 2-3 డిగ్రీల లోతు గాయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాలలో రోగికి స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్‌తో పాటు రీ కన్స్ట్రక్టివ్ ఫ్లాప్ చేయాల్సి ఉంటుంది. కొందరికి స్కిన్ గ్రాఫ్టింగ్ చేస్తే సరిపోతుంది.
సాధారణంగా రోగి 2-3 డిగ్రీల లోతు కాలిన లేదా ఇతర గాయాలకు గురైనప్పుడు స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. గతంలో అయితే కాలిన గాయాలకు పట్టీలు చుట్టీ, అక్కడ చర్మం ఊడిపోయి, ఎర్రటి పుండు వచ్చిన తరువాతనే స్కిన్ట్రాన్స్ప్లాంట్ చేసేవారు. అయితే ఈ పద్ధతిలో స్కిన్ గ్రాఫ్టింగ్ చేసే లోపు ఇన్ఫెక్షన్స్ వచ్చి కొన్నిసార్లు రోగి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేది. కానీ, ప్రస్తుతం ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రోగికి కాలిపోయిన చర్మాన్ని వెంటనే తొలగించి, రోగి శరీరంలోని తొడ భాగం నుంచి చర్మాన్ని తీసి గాయమైన చోట ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. కొంత మందికి చర్మాన్ని తీసే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వారికి స్కిన్ బ్యాంక్ నుంచి సేకరించిన చర్మాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ చర్మం శరీరానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. దీనివల్ల కాలిన గాయం త్వరగా మానుతుంది. ఈ స్కిన్‌బ్యాంక్ నుంచి స్కిన్ట్రాన్స్ప్లాంట్ చేసిన రెండు వారాల తరువాత తిరిగి రోగికి ఆటో స్కిన్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే వారి శరీరం నుంచి సేకరించిన చర్మాన్ని వేస్తారు. పూర్తి చికిత్సకు కనీసం రెండు నెలల సమయం పడుతుంది.
యాసిడ్ దాడులు, విద్యుదాఘాతాలకు గురైన వారికి, రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలకు గురైన రోగులకు కండ, నరాలు, రక్తనాళాలు దెబ్బతిని ఎముకలు బయటకు తేలుతాయి. దీంతో అవయవ భాగాలు పూర్తిగా దెబ్బతిని, రూపం చెదిరిపోతుంది. అలాంటి రోగులకు చికిత్సతో పాటు ప్రతిరూపం ఇచ్చేందుకు దెబ్బతిన్న అవయవాలను ఫ్లాప్ సర్జరీ ద్వారా పునర్ నిర్మాణం చేసి, కొత్త రూపాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా తెగిపోయిన నరాలు, రక్తనాళాలను తిరిగి అనుసంధానం చేసి, చేతులు, కాళ్లు వంటి అవయవాలు యధావిధిగా పనిచేసేలా చికిత్స చేస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ముక్కు, చెవి, పెదాలు, నాలుక, కనురెప్పలు వంటి అవయవాలు కోల్పోతారు. అలాంటివారికి సైతం కోల్పోయిన అవయవాలను పునర్ నిర్మించే అవకాశం ఉంది.
ఫ్యాక్టరీలలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాళ్లు, చేతులు, వేళ్లు తెగిపడిన వారికి ఆ అవయవాలను తిరిగి అతికించవచ్చు. ఇందులో మైక్రోవ్యాస్కులర్ శస్త్రచికిత్స ద్వారా శరీరంలోని ఒక భాగం నుంచి రక్తనాళాలు సహా ఎముక, చర్మం, కండను తీసి దెబ్బతిన్న అవయవాన్ని పునర్ నిర్మిస్తారు.
రోడ్డు ప్రమాదాలు, గొడవల్లో.. ఫేషియల్ బోన్స్ (ముఖంలోని ఎముకలు) మ్యాగ్జిల్లా, జైగోమా, మాండబుల్, ఆర్బిటల్ బోన్స్ వంటివి విరిగిపోతాయి. దీని వల్ల కళ్లు, శ్వాస నాళం, దవడలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీంతో రోగి తినడానికి, శ్వాస తీసుకోవడానికి వీలుండదు. చూపు కూడా కోల్పోవచ్చు. ఈ సమస్యలను అధిగమించేందుకు ‘మినీ ప్లేట్ అండ్ స్క్రూస్’ ద్వారా విరిగిన ఫేషియల్ బోన్స్‌ను జోడించి యథారూపాన్ని అందిస్తారు.
అవయవ లోపాలతో జన్మించిన చిన్నారులకు, గ్రహణ మొర్రి, తొర్రి, కొండ నాలుక, చెవులు లేకుండా జన్మించడం, చేతి వేళ్లు అతుక్కుపోయి జన్మించిన వారికి శస్త్రచికిత్స ద్వారా లోపం ఉన్న అవయవాలను పునర్ నిర్మించే అవకాశం ఉంటుంది. కంతులు తదితర సమస్యలతో అవయవాలు దెబ్బతిన్న వారికి సైతం ప్లాస్టిక్ సర్జరీద్వారా రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్స చేస్తారు.
కొంత మంది ఆడ శిశువులు పొలాండ్ సిండ్రోమ్ (ఒకవైపు రొమ్ము, ఛాతీ లేకపోవడం), వ్జైనల్ ఏజెనసిస్ (యోని లేకపోవడం)తో జన్మిస్తారు. ఇలాంటి లోపాలున్న వారికి యుక్త వయస్సు వచ్చిన తరువాత శస్త్రచికిత్సలు జరిపి, వివాహానికి అర్హులుగా మార్చి, కొత్త రూపాన్ని ఇస్తారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సలు ఉస్మానియాలో 20 వరకు చేశారు. ఇందులో ఎక్కువగా వ్జైనల్ ఎజెనసిస్ కేసులు ఉన్నాయి.
ముక్కు వంకరగా, చప్పడి ముక్కు, బల్బస్ నోస్, రైనోఫైమా (వెడల్పు ముక్కు), డొప్ప చెవులు, ఎత్తు పళ్లు లాంటి సమస్యలున్న వారికి కాస్మెటిక్ సర్జరీ ద్వారా అవయవాలను సరిచేసి కొత్త రూపును ఇస్తారు. ఊబకాయం ఉన్నవారికి లైఫో సెక్షన్, ఎబ్డామినో ప్లాస్టీ ద్వారా సరిచేయడం జరుగుతుంది. రొమ్ములు పెద్దగా ఉన్న వారికి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ ద్వారా, రొమ్ములు చిన్నగా ఉన్నవారికి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అండ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా సరిచేసి కొత్త రూపు ఇవ్వొచ్చు. బట్టతల వారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా అందమైన రూపం అందించవచ్చు.