Beauty tips : ఉరుకులు, పరుగుల జీవితాలు.. కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణగా చిన్న వయసులోనే చాలామంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. చలికాలంలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం కోసం చాలా మంది భారీగా ఖర్చు చేస్తుంటారు. ఆయన ఫలితం లేక ఆవేదన చెందుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని సహజ పద్ధతుల ద్వారా జుట్టును సంరక్షించుకునే అవకాశం ఉంది. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో, జుట్టుకు సంబంధించి ఇతర సమస్యలను దూరం చేయడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
తమలపాకులు జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. తమలపాకుల్లో విటమిన్ ఎ, సి, బి1, బి2, పొటాషియం, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు లాంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని, చిట్లడాన్ని నివారిస్తాయి. తమలపాకులను ఉపయోగించడం ద్వారా తలలో దురద, తెల్ల జుట్టు సమస్య కూడా నయమవుతుంది. సమస్య పరిష్కారం కోసం తమలపాకులను ఎన్ని రకాలుగా వినియోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
తమలపాకుల నీరు జుట్టు సమస్యలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. తమలపాకుల నీటిని తయారు చేయడానికి 15 నుంచి 20 తమలపాకులను ఒక పాత్రలో వేసి మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి చల్లర్చాలి. ఆ నీటితో జుట్టును వాష్ చేసుకోవాలి. అనంతరం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. తమలపాకుల్లో యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేయడంతోపాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడం కోసం తమలపాకులను నేరుగా కూడా తినవచ్చు. ఇందుకోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో 5 నుంచి 6 తమలపాకులను నమలాలి. లేదంటే తమలపాకుల నీటిని కూడా తాగవచ్చు. ఇందుకోసం 10 నుంచి 15 తమలపాకులను మరిగించి, ఆ నీటిని వడకట్టుకోవాలి. ఆ నీటిని తాగడంవల్ల జుట్టు రాలే సమస్య నియంత్రణలోకి రావడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
తమలపాకులు, నెయ్యి హెయిర్ మాస్క్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ జుట్టును ఒత్తుగా మారుస్తుంది. ఇందుకోసం ముందుగా 15 నుంచి 20 తమలపాకులను తీసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి, కొన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. ఆ పేస్టులో ఒక చెంచా నెయ్యి కలిపి, రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పూసుకోవాలి. గంటపాటు ఆరనిచ్చి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలాచేస్తే మెరుగైన ఫలితాలను చూడవచ్చు.
తమలపాకుల నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందుకోసం కొబ్బరి నూనె లేదా ఆవాల నూనెను తక్కువ మంటపై మరిగించాలి. ఆ తర్వాత 10 నుంచి 15 తమలపాకులను ఆ నూనెలో వేసి మరికాసేపు మరిగించాలి. తమలపాకులు నల్లగా మారగానే మరిగించడం ఆపాలి. అనంతరం నూనెను చల్లార్చి, వడకట్టి ఓ బాటిల్లో తీసుకోవాలి. ఈ నూనెను జుట్టుకు రాసుకుని, రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలాచేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.