నెయ్యి.. ఆహారానికే కాదు, అందానికీ మెరుగులు అద్దుతుంది. ముఖ్యంగా.. చర్మ సంరక్షణలో దివ్యంగా పనిచేస్తుంది. నిత్యం యవ్వనంగా కనిపించేందుకు సాయపడుతుంది. ప్రతిరోజూ భోజనానికి ముందు ఒక చెంచా నెయ్యి తీసుకుంటే.. చర్మంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.
చర్మం యవ్వనంగా కనిపించాలని, ముడతలు తగ్గించుకోవాలని.. యాంటి ఏజింగ్ ఉత్పత్తులకు వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. కానీ, నెయ్యి.. సహజంగానే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే నెయ్యి.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. దీర్ఘకాలంలో చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఎలాంటి సింథటిక్ ఉత్పత్తులను ఉపయోగించకుండానే.. చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా, కాంతిమంతంగా మార్చేస్తుంది.
చలికాలంలో చర్మం పొడిబారకుండా.. ముఖం, పెదవులకు నెయ్యి రాసుకోవడం తాతమ్మల కాలం నుంచే ఉన్నది. చర్మాన్ని తేమగా ఉంచడంలో నెయ్యి సాయపడుతుంది. ఇది చర్మ పొరల్లోకి చొచ్చుకుపోయి.. లోపలి నుంచి పునరుజ్జీవ శక్తిని అందిస్తుంది. సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేసి.. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
నెయ్యిలో లభించే విటమిన్ డి.. కొత్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. చర్మం ఎళ్లవేళలా యవ్వనంగా కనిపించేలా చూస్తుంది.
నెయ్యిలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్.. కళ్ల కింద నల్లని వలయాలను దూరం చేస్తాయి. ముఖ వర్ఛస్సును పెంచుతాయి.
నెయ్యిలోని యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చర్మం ఎర్రబడటం, దురద, మంటను నివారించడంలో.. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ సమర్థంగా పనిచేస్తుంది.