సోమవారం 23 నవంబర్ 2020
Badradri-kothagudem - Nov 17, 2020 , 05:09:38

నిమిషాల్లో హక్కు పత్రాలు

నిమిషాల్లో హక్కు పత్రాలు

  • ధరణితో సులభమైన రిజిస్ట్రేషన్లు
  • ఉమ్మడి ఖమ్మంలో జోరందుకున్న రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు
  • వేగవంతమైన సేవలపై వేనోళ్ల పొగడ్తలు

 భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ :  ఎక్కడాలేని ధరణి సేవలు తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి వచ్చి.. నిమిషాల్లోనే హక్కు పత్రాలు చేతికందుతుండటంతో ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుంచి విదేశాలలో ఉండే ప్రజలు సైతం ధరణిలో తమ భూములు చూసుకుంటూ మురిసిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జోరందుకున్నది. ప్రతిరోజు ఏదో ఒక మండలంలో రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉండటంతో ధరణి పోర్టల్‌పై ప్రజలు ఆసక్తి  కనబరుస్తున్నారు.  సులభంగా రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతుండడంతో ప్రజల్లో ఎక్కడ చూసినా ధరణి పోర్టల్‌ పైనే చర్చ జరుగుతుంది. 

18 ఏళ్లకే భూ యజమానిని... 


మా నాన్న తనకున్న పొలంలో 30 కుంటల భూమిని ధరణి వెబ్‌సైట్‌ ద్వారా నాకు రిజిస్ట్రేషన్‌ చేశారు. ధరణి వెబ్‌సైట్‌లో ఒకేసారి రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌ను అధికారులు పూర్తి చేశారు. గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా భూమిని నా పేరు మీదకు మార్చారు. దీంతో 18 యేండ్లకే నేను భూ యజమానాని అయ్యాను. ఒకేసారి రిజిస్ట్రేషన్‌తో పాటు ఆన్‌లైన్‌లో పొలం నా పేరు మీదకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ధరణి ద్వారానే ఇది సాధ్యమైంది.

- ఆళ్ల లీనా, గొల్లెనపాడు, వైరా

మీరు అదృష్టవంతులబ్బా! 


దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌లో భూమి వివరాలు పొందుపరచడం నాకు ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. గతంలో మేము వైరా మండలం రెబ్బవరం గ్రామంలో నివసించాం. ప్రస్తుతం ఏపీలోని విజయవాడలో ఉంటున్నాం. మా తల్లి పేరుపై ఉన్న 15 కుంటల పొలాన్ని ధరణితో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. ఒకేసారి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ విధానం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. అందుకే తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులు. మా ఏపీలో కూడా ఇలాంటి సౌలభ్యం లేదు. 

- వై.రాజకుమార్‌, విజయవాడ