Janasena | కృష్ణా జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి పేర్ని నాని గుడివాడలో జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆయన డ్రైవర్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పేర్ని నాని గుడివాడ వెళ్లిన సమయంలో ఆయనపై దాడికి తెగబడి.. కారు అద్ధాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పేర్ని నాని ఫిర్యాదు మేరకు జనసేన నాయకులపై మచిలీపట్నం పోలీసులు జీఆరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును గుడివాడ పీఎస్‌కు బదిలీ చేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని ఆదివారం గుడివాడకు వెళ్లిన సమయంలో ఆయనపై జనసేన నాయకులు దాడికి తెగబడ్డారు. గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి పేర్ని నాని ఆదివారం వచ్చారు. నాని రాక గురించి తెలుసుకున్న జన సైనికులు అక్కడికి చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన జన సైనికులు పేర్ని నానిపై కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటనతో పేర్ని నాని గుడివాడ నుంచి వెనుదిరిగారు. అదే సమయంలో మరికొందరు కారుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పేర్ని నాని కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు తోట శివాజీ ఇంటికి చేరుకుని జన సైనికులను అదుపులోకి తీసుకున్నారు. పేర్ని నానికి అక్కడి నుంచి జాగ్రత్తగా పంపించేశారు.
గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అప్రమత్తమైన పోలీసులు జన సైనికులను అదుపులోకి తీసుకున్నారు. పలువుర్ని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయగా.. మిగతా జన సైనికులు పోలీసుల వాహనాలకు అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు, జనసైనికుల మధ్య వాగ్వాదం నెలకొంది.