YS Jagan | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆయన మేనత్త విమలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ దేవుడిపై ఆధారపడ్డారని విమలమ్మ అన్నారు. జగన్ ఇప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించే శక్తిని జగన్కు ఆ దేవుడు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ, విమలమ్మ, భారతి, రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తల్లి వైఎస్ విజయమ్మ, జగన్ను కౌగిలించుకొని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని ఆయన సముదాయించారు. అనంతరం జగన్ తన మూడు రోజుల పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయల్దేరారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమలమ్మ మాట్లాడుతూ.. జగన్కు ఏ కష్టం వచ్చినా ఆ దేవుడు తోడుగా ఉంటాడని తెలిపారు.
వైఎస్ జగన్కు సొంత కుటుంబసభ్యులే వ్యతిరేకంగా మారిన సమయంలో విమలమ్మ ఆయనకు అండగా నిలబడ్డారు. వైఎస్ షర్మిల, సునీతలు చేసిన విమర్శలపై గతంలోనూ విమర్శించారు. ఎన్నికలకు ముందు విమలమ్మ మాట్లాడుతూ.. షర్మిల, సునీత ఇద్దరూ అన్యాయంగా మాట్లాడుతున్నారని.. వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్ రెడ్డి హత్య చేశాడని ఆరోపిస్తున్న వాళ్లు.. చంపడం చూశారా అని ప్రశ్నించారు. తమ ఇంట్లో వాళ్లే ఇద్దరూ ఇలా తయారవ్వడం బాధగా ఉందన్నారు. ఏ సంబంధం లేని జగన్ను కూడా ఇందులోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీత వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని.. ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇద్దరు అక్కాచెల్లెళ్లు నోరు మూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.