Chiranjeevi – Sajjala | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మెగాస్టార్ మద్దతు ఇవ్వడంలో ఆశ్చర్యమేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చిరంజీవి మాత్రమే కాదు. కూటమికి ఇంకా ఎంత మంది మద్దతు ఇచ్చినా తమ పార్టీకి నష్టం లేదని స్పష్టం చేశారు. ఎంత మంది కలిసి వచ్చినా కూటమికి కలిసొచ్చేదేమీ లేదని ఆదివారం మీడియాతో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై ఇప్పుడు క్లారిటీ వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీ రాజకీయ తెరపై ఇటువైపు ఏపీ సీఎం- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉన్నారని, అటువైపు, తోడేళ్లు, గుంట నక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 25న పులివెందులలో వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. రెండు రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తామని అన్నారు.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఏజెండా లేదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కేవలం అధికారం కోసమే పొత్తులతో టీడీపీ కూటమి అటువైపు, ఇటువైపు ప్రజలకు మంచి చేసిన వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచాయన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి చేరిందని స్పష్టం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఆలోచన లేని, అవగాహన లేని రాజకీయ నాయకుడు అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పుట్టాడని, పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. చంద్రబాబు బటన్ నొక్కితే పవన్ కల్యాణ్ కదులుతాడని, ఆగిపోమంటే ఆగిపోతాడన్నారు. చంద్రబాబుతోనే పవన్ కల్యాణ్ రాజకీయ అంకం ముగుస్తుందని పేర్కొన్నారు.