హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 259వ సాక్షిగా వైఎస్ షర్మిల సహా పలువురు సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది. వైఎస్ షర్మిల దగ్గరి నుంచి.. అఖరికి ఏపీ సీఎం జగన్ అటెండర్ నవీన్ వాంగ్మూలం వరకు కూడా సీబీఐ ( CBI ) తీసుకుంది.
ఈ సందర్భంగా దర్యాప్తులోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి గత నెల 30న కోర్టుకు సమర్పించింది. కోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ వివరాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో సీఎం జగన్ ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, విశ్రాంత సీఎస్ అజేయ్‌కల్లం, వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్‌కుమార్ సాక్షులుగా ఉన్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.
2019 మార్చి 15న జగన్ లోటస్‌పాండ్‌లో ఉన్నట్లు సాక్షులు తెలిపారని సీబీఐ వెల్లడించింది. లోటస్‌పాండ్‌లో మేనిఫెస్టోపై చర్చిస్తుండగా వైఎస్ వివేకా మరణించిన రోజు అవినాష్‌రెడ్డి (Avinash Reddy ) ఫోన్ చేశారని, కృష్ణమోహన్‌రెడ్డికి ఫోన్ ఇవ్వమని అవినాశ్ చెప్పగా అటెండర్ నవీన్ ఇచ్చానని తెలిపారు. ఆ తర్వాత వారు మాట్లాడుకున్నది వినలేదని వెల్లడించారు. లోటస్‌పాండ్‌లో సమావేశం జరుగుతుండగా ఉదయం 5.30 గంటలకు జగన్ అటెండర్ తలుపు కొట్టారని, భారతి పైకి రమ్మంటున్నారని అటెండర్ జగన్‌కు చెప్పారని అజేయ్ కల్లం వెల్లడించారు. బయటకు వెళ్లిన 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన జగన్ బాబాయ్ ఇక లేరని చెప్పినట్లు ఆయన వెల్లడించినట్లు సీబీఐ పేర్కొంది.
వివేకా మరణించారని అవినాష్‌రెడ్డి తనకు చెప్పాడని జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి సీబీఐకి వివరించారు. సమావేశం జరుగుతుండగా జగన్ వచ్చి వివేకా మరణించారని చెప్పారని, వివేకా మరణం గురించి జగన్‌కు చెప్పింది ఎవరో తనకు గుర్తు లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపినట్లు సీబీఐ పేర్కొంది.