YS Vijayamma | ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ శనివారం కీలక ప్రకటన చేశారు. కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
‘కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్‌ను అభిమానించే, ప్రేమించే వారికి నా హ్రుదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి, పార్లమెంట్‌కు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా’ అని విజ్ఞప్తి చేశారు.
మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరుగనుండగా వైఎస్ విజయమ్మ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు.