అమరావతి : ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) తన అన్న, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్( YS Jagan) పై మరోసారి విరుచుకుపడ్డారు. ఆస్తుల విషయంలో కోర్టుకు వెళ్లిన జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆస్తులపై ప్రేమతో రక్త సంబంధం, అనుబంధాలు మార్చారని ఆరోపించారు.
జగన్కు మూడు ప్రశ్నలతో కూడిన లేఖను ఆమె రాశారు. కుటుంబ విషయాలను జగన్ రోడ్డు మీదకు తీసుకువచ్చారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారని విమర్శించారు. చెల్లిపై ప్రేమతో జగన్ షేర్లు (Shares) బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. తాను చేస్తున్న ఆరోపణల వెనుక ఆస్తులను లాక్కోవడానికి కారణంగా చెబుతున్నారని, ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు.
ఈడీ కేసులు(ED Cases), బెయిల్ రద్దవుతుందని కారణాలు చెబుతున్నారని ఆరోపించారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదని, వివరించారు. రూ. 32 కోట్ల విలువైన కంపెనీ భూమిని ఈడీ అటాచ్ చేసిందని వెల్లడించారు. కంపెనీ షేర్లను ఎప్పుడూ ఈడీ అటాచ్ చేయలేదని అన్నారు. ఏ సమయంలోనైనా షేర్లను బదిలీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఏ కంపెనీ ఆస్తులనైనా ఈడీ అటాచ్ చేసినా షేర్ల బదిలీని ఆపలేదని షర్మిల వివరించారు. 2016లో ఈడీ అటాచ్ చేసినందున షేర్ల బదిలీ చేయకూడదని జగన్ వాదిస్తున్నారని ఆరోపించారు.