అమరావతి : ఏపీలో శాంతిభద్రతలు బ్రతుకాలంటే ముందుగా సీఎం చంద్రబాబు(Chandrababu) , లోకేష్ (Lokesh ) ను ముద్దాయిగా చేర్చాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న హత్య రాజకీయాల వెనుక ఉన్న వ్యక్తులకు తండ్రి, కొడుకు మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల నంద్యాల(Nandyala) జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామలో దారుణ హత్యకు గురైన సుబ్బారాయుడి కుటుంబాన్ని శుక్రవారం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన, రెడ్‌బుక్( Red book ) పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ఊళ్లలో ఆధిపత్యంకోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రత్యర్థులపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హత్యల వెనుక ఉన్నదెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులు కూడబలుక్కొని ప్రత్యర్థులపై దాడులు చేస్తూ, భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
క్షీణించిన శాంతిభద్రతలు..
రాష్ట్రంలో శాంతి భద్రతలు (Law and Order) క్షీణించిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసులు వేస్తామని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు వైసీపీ కార్యకర్తలు, నాయకులకు రక్షణ కల్పించాలని, గ్రామాల్లో ఫికెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండలానికి ఇద్దరు వైసీపీ నాయకులను చంపివేయాలని స్థానిక .ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి బహిరంగంగా పేర్కొనడం దారుణమైన విషయమని , అతడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఉండి ఉంటే ఇప్పటికే రైతు అకౌంట్లలో రైతు భరోసా జమ అయ్యేదని వివరించారు.