అమరావతి : వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఏపీలో శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని హోంమంత్రి అనిత (Home Minister Anita) ఆరోపించారు. చిన్న సమస్యలను భూతద్దంలో చూయించి సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు. విజయనగరంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయిన బాధలో జగన్ ఏదోదో మాట్లాడుతున్నారని విమర్శించారు.
డయేరియాతో జనాలు చనిపోతున్నారని ప్రభుత్వం జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు. విజయనగరం జిల్లాలో డయేరియాతో (Diarrhea) ఒక్కరే చనిపోయారని గుర్తు చేశారు. డయేరియా ప్రభలిన చోట అన్ని జలవనరుల నుంచి నీటి శాంపిళ్లు తెప్పించి పరీక్షలు జరిపిస్తున్నామని వెల్లడించారు. బాధిత ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ (YCP) హయాంలో డయేరియా తో చనిపోయిన బాధిత కుటుంబాలను జగన్ పరామర్శించలేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో చెత్తమీద పన్ను వేశారు కానీ చెత్త తీయించలేకపోయారని పేర్కొన్నారు. ఐదేళ్లపాటు మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ కూడా చేయలేదరి అన్నారు.
కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా మళ్లించారని ఆరోపించారు. అవాస్తవాలతో జనాలను మభ్యపెడుతున్నారని అన్నారు. డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడూ సమీక్షలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని ఆమె వివరించారు.