Gudivada Amarnath | రాజకీయాల కోసం తిరుమల వెంకన్నను చంద్రబాబు వివాదంలోకి లాగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్‌తో ఏదైనా ఉంటే నేరుగా తలపడాలని అన్నారు. నెయ్యి కల్తీ వివాదంపై మేమే సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాలు విసిరారు. తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను విమర్శిస్తూ వైసీపీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. 100 రోజుల పాలనలో తమ పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే మాట్లాడుతున్నారని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుమలను వాడుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పులతో జనసేన దీక్షలు చేస్తోందని విమర్శించారు. సూపర్ 6 హామీలు అమలు చేయనుందుకు పవన్‌కల్యాణ్ దీక్ష చేయాలని సూచించారు. ఎవరు తప్పు చేస్తారో వారే ప్రాయశ్చిత దీక్ష చేస్తారని వ్యాఖ్యానించారు.
నమ్మకంతో తిరుమలకు వెళ్లేవారికి డిక్లరేషన్ ఎందుకు అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్లడం అనేది జరగని పని అని అన్నారు. సమయం చూసుకుని జగన్ మళ్లీ తిరుమలకు వెళ్తారని తెలిపారు. జగన్‌ను ఎవరు ఆపుతారో చూస్తామని స్పష్టం చేశారు.
ఎప్పుడూ డిక్లరేషన్ అడగలేదు: భూమన
తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్వామి వారి ప్రసాదంపై అపవాదు వేశారని మండిపడ్డారు. సీఎం హోదాలో తప్పుడు వ్యాఖ్యలు చేశారని అన్నారు. తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. ధైర్యంగా సీబీఐ విచారణకు మేం డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రిని తిరుమల రాకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు 700 మంది అన్యమతస్తులు తిరుమలకు వస్తారని చెప్పారు. తాము ఏనాడూ డిక్లరేషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు.
కొత్తగా డిక్లరేషన్ ఎందుకు : మల్లాది విష్ణు
వైసీపీపై కావాలనే బురద జల్లుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. శ్రీవారి లడ్డూను రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని స్పష్టం చేశారు. లడ్డూ వివాదంలో ప్రజలు అన్ని గమనించారని అన్నారు. అందుకే డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్నోసార్లు తిరుమల వెళ్లిన జగన్ ఇప్పుడు కొత్తగా డిక్లరేషన్ ఇవ్వడమేంటని నిలదీశారు.