AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ విరుచుకుపడింది. తనను ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ నాశనమే లక్ష్యంగా సైకోలతో కలిసి ఫేకు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా పెట్టవద్దంటూ ఫేకు జగన్ ఫేక్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీలో పెట్టుబడులపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు నాయుడు నిన్న యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్‌తో ఆన్లైన్ వేదికగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో యూట్యూబ్ గ్లోబల్ అకాడమీ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను చర్చించారు. అమరావతిలోని మీడియా సిటీలో యూట్యూబ్ కార్యకలాపాలు ప్రారంభించాలని, పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు చేసిన సూచనకు వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్(ఎక్స్) వేదికగా వెల్లడించారు. అయితే దీనిపై కొంతమంది వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. గూగుల్‌ను ట్యాగ్ చేస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు.
‘ ఏపీలో లా అండ్ ఆర్డర్ కుంటుపడింది. మీ మహిళా ఉద్యోగులు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు వేధింపులకు గురి కావాలని మీరు కోరుకోవడం లేదని భావిస్తున్నారు. అన్యాయం జరుగుతుంటే ఇక్కడ పోలీసులు కూడా చూస్తూ ఉంటారు తప్ప ఏం చేయరు. నెదర్లాండ్స్‌కు కూడా ఈ విషయం తెలుసు. అమరావతి వరద ప్రభావిత ప్రాంతం. కాబట్టి అమరావతి కంటే హైదరాబాద్‌ను ఎంచుకోవడం బెటర్ ఆప్షన్’ అంటూ గేమ్ చేంజర్ అనే ఐడీతో ఒక వ్యక్తి గూగుల్‌కు ట్యాగ్ చేశారు. ‘ ఏ ఇడియట్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకోడు. వాళ్లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనే పెట్టుబడులు పెడతారు.’ అంటూ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి చేసిన ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్ల స్క్రీన్షాట్లను జోడిస్తూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీపై పగబట్టిన జగనే ఇలా తన అనుచరులతో ఇలాంటి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడింది.
ఆంధ్రప్రదేశ్ పై పగ పట్టిన, “ఫేకు జగన్”. తనని ఘోరంగా ఓడించిన ఆంధ్రప్రదేశ్ నాశనమే లక్ష్యంగా సైకోలతో ఫేకు ప్రచారం. ఏపి బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు అంటూ, ఫేకు క్యాంపెయిన్ రన్ చేస్తున్న, “ఫేకు జగన్”#FekuJagan #EndOfYCP #AndhraPradesh pic.twitter.com/LprqBvKClj
— Telugu Desam Party (@JaiTDP) August 7, 2024
ఈ క్రమంలోనే గతంలో వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాలను కూడా ఈ సందర్భంగా టీడీపీ ప్రస్తావించింది. ఐటీ, ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు అమరావతికి రావాలని నాస్కామ్‌ను నారా లోకేశ్ ఆహ్వానం పలికారు. అప్పుడు కూడా కొందరు వైసీపీ మద్దతురాలు నాస్కామ్‌ను ట్యాగ్ చేస్తూ అమరావతిలో పెట్టబడులు పెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదని తెలిపారు. అలాగే రాకీ అండ్ మయూర్ అనే ఫుడ్ వ్లాగర్స్ వచ్చినప్పుడు వైసీపీ చేసిన ట్వీట్‌ను కూడా ప్రస్తావిస్తూ జగన్‌పై మండిపడింది.