YS Jagan | అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు బాధకలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో శుక్రవారం పర్యటించిన వైఎస్ జగన్.. ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎసెన్షియా ప్రమాద బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎసెన్షియా ఘటనపై ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని తెలిపారు. బాధితులకు వైద్యం వెంటనే అందలేదని అన్నారు. కలెక్టర్లు, అధికారులు స్పాట్‌కి వెళ్లలేదని తెలిపారు. కనీసం అంబులెన్స్ కూడా పంపించలేదని మండిపడ్డారు. కంపెనీ బస్సుల్లో బాధితులను తరలించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనే తమ హయాంలో జరిగిందని గుర్తుచేశారు.
ఎల్జీ పాలిమర్స్‌లో తెల్లవారుజామున ప్రమాదం జరిగితే.. ఉదయం 5 గంటలకల్లా అధికారులు స్పాట్‌కు వెళ్లారని వైఎస్ జగన్ తెలిపారు. ఉదయం 6 గంటల కల్లా తమ నాయకులు ఘటనాస్థలికి వెళ్లారని చెప్పారు. 11 గంటల కల్లా తాను ఘటనాస్థలానికి చేరుకున్నానని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 24 గంటల్లోనే పరిహారం అందించామని తెలిపారు. బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇచ్చిన మొదటి ప్రభుత్వం తమదే అని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం స్పందించిన తీరు బాధగా అనిపిస్తోందని అన్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదంలో ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని సూచించారు.
పరిహారం అనేది సానుభూతితో ఇవ్వాలని వైఎస్ జగన్ సూచించారు. ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలని.. ఇప్పటివరకు ఒక రూపాయి ముట్టలేదని అన్నారు. ఇంతవరకు ఏ ఒక్కరికీ డబ్బు అందలేదని తెలిపారు. బాధితులకు త్వరగా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు పరిహారం ఇవ్వకపోతే తానే స్వయంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు.
అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే ఈ ఘటన గురించి ఎక్కువ స్పందించకూడదు అనే తాపత్రయం కనపడింది
17 మంది చనిపోతే సాయంత్రం 4 గంటలకు హోం మంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సహాయచర్యలను పర్యవేక్షించడానికి అనకాపల్లి వెళ్తున్న అనేమాట… pic.twitter.com/eDoLJ7cNev
— YSR Congress Party (@YSRCParty) August 23, 2024
ప్రెస్మీట్లో ఏపీ సీఎం చంద్రబాబు మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయని వైఎస్ జగన్ అన్నారు. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. జగన్ హయాంలోనే ఎక్కువ జరిగాయంటూ డైవర్ట్ చేసేలా చంద్రబాబు మాట్లాడారని మండిపడ్డారు. ప్రభుత్వం అనేది బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెడ్‌బుక్ మీదే ఈ ప్రభుత్వం దృష్టిసారించిందని విమర్శించారు. రెడ్‌బుక్ మీద పెట్టిన శ్రద్ధ.. ఇలాంటి వాటి మీద పెట్టి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండేవి కాదని అన్నారు.