అమరావతి : జనసేన నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు (Nagababu) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ( YS Jagan ) సెటైర్లు వేశారు. జనసేన ( Janasena ) పార్టీ 12వ వార్షికోత్సవాలు శుక్రవారం పిఠాపురంలో జరిగాయి. ఈ సందర్భంగా నాగబాబు బహిరంగసభలో మాట్లాడుతూ జగన్‌పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆరోపించారు.
మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ లాంటి హాస్యనటుడు ఎన్నో కలలు కన్నారని ఎద్దేవా చేశారు. మరో 20 ఏళ్ల వరకు కలలు కంటూనే ఉండాలని సూచించారు. గత 9 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిందని అన్నారు. విజయం వెనుక పవన్‌కల్యాణ్ పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు, జనసైనికులకు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు.
పవన్ పుట్టేటప్పుడు కూడా తల్లికి నొప్పి, బాధ తెలియనివ్వలేదని అన్నారు. ప్రజల బాగోగులు చూసే వ్యక్తి పవన్ అని కొనియాడారు. పవన్‌లా గొప్ప వ్యక్తి కావాలి.. లేకుంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తని అన్నారు. తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
జనసైనికుడిని అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని పేర్కొన్నారు. నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని , ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశామని వైసీపీ గురించి అన్నారు. గత ఎన్నికల్లో నోటిదురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని విమర్శించారు.