YS Jagan | హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసంతో ఏపీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారే ఉండకూడదనే రీతిలో రాష్ట్రంలో అణచివేత పాలన కనిపిస్తోందని అన్నారు. బాధితులు కేసు పెట్టడానికి వెళ్తే.. వారిపైనే రివర్స్ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. మిథున్ రెడ్డి మీద దాడి చేసి ఆయనపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. వినుకొండ హత్యకేసులో టీడీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని జగన్ ప్రశ్నించారు. మదనపల్లి ఫైల్స్ అంటూ ఏదేదో ప్రచారం చేస్తున్నారని అన్నారు. వినుకొండ ఘటనను దారి మళ్లించేందుకే మదనపల్లి ఇష్యూ తెచ్చారని విమర్శించారు.
డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని జగన్ విమర్శించారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారని అన్నారు. దీనికి పెద్దిరెడ్డికి లింక్ పెడుతున్నారని మండిపడ్డారు. ఆర్డీవో ఆఫీసులో ఒకవేళ డాక్యుమెంట్లు కాలిపోతే అవే రికార్డులు ఎమ్మార్వో ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసుల్లో ఉంటాయని తెలిపారు. అయినా ఏదో జరిగిపోతున్నట్లు దారుణంగా హైడ్రామా చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారని మండిపడ్డారు. మదనపల్లికి హెలికాప్టర్ పంపించిన చంద్రబాబు నాయుడు.. ముచ్చుమర్రికి ఎందుకు హెలికాప్టర్ పంపించలేదని ప్రశ్నించారు. జగన్‌కు పేరు వస్తుందని దిశ పోలీస్ స్టేషన్లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీ లక్ష్యంగానే పల్నాడులో పోలీసు అధికారులను మార్చారని అన్నారు. న్యాయం, ధర్మం వైపు పోలీసులు నిలబడటం లేదని విమర్శించారు.
పిన్నెల్లికి మంచిపేరు ఉంది కాబట్టే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని జగన్ అన్నారు. పిన్నెల్లి లాంటి మంచి నాయకుడిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌బుక్ పేరుతో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారడానికి కారణం రెడ్‌బుక్ అని ఆరోపించారు. రెడ్‌బుక్‌ను చూపిస్తూ నారా లోకేశ్ బెదిరింపులకు దిగారని అన్నారు. రాష్ట్రమంతా హోర్డింగులు పెట్టి ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.