అమరావతి : అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఏపీ విద్యుత్ కొనుగోలు (Power purchase ) ఒప్పందంలో లంచం వ్యవహారంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) క్లారిటీ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీతో(Adani) విద్యుత్ కొనుగోలులో రూ.1,700 కోట్లు అవినీతికి పాల్పడ్డారని యూఎస్ అధికారులు చేసిన ఆరోపణలపై తొలిసారి జగన్ స్పందించారు. గురువారం తాడేపల్లి నివాసం నుంచి జగన్ మీడియాతో మాట్లాడారు.
వైసీపీ పాలనలో సెకీతో (SECI) జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, రాష్ట్రానికి కలిగిన లాభాలు, చంద్రబాబు (Chandrababu) హయాంలో 2014-19 వరకు జరిగిన కొనుగోలు వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. నాకు లంచం ఇవ్వబోయినట్లు ఎక్కడైనా ఆధారాలున్నాయా అని తెలిపారు. ఎఫ్‌బీఐ ఛార్జిషీట్లో నా పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలియకుండా నాపై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అదానీకి చాలా ప్రాజెక్ట్లున్నాయని వివరించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సెకీతో 9వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు చర్చలు జరిగాయని వివరించారు. యూనిట్‌కు రూ. 2.49పైసలకు సెకీతో 25 సంవత్సరాలకు ఒప్పందం జరిగిందన్నారు. అంతకుముందు రూ.5.10పైసలకు కొన్న విద్యుత్‌ను తాము రూ. 2.49పైసలకు కొనుగోలు చేశామని అన్నారు. దీంతో పాటు ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కింద కేంద్రం ప్రత్యేక ప్రోత్సహకాలు ఇస్తామని సెకీ ఆఫర్ ఇచ్చిందని పేర్కొన్నారు .
ఈ ఒప్పందం వల్ల లక్ష కోట్ల రూపాయలు ఆధాయం జరిగితే ఎవరైనా వద్దంటారా? అని ప్రశ్నించారు. రూ. లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి కాదా అని అన్నారు. సెకీ ఒప్పందం చారిత్రక నిర్ణయమని తెలిపారు. నేను సంపద సృష్టిస్తే చంద్రబాబు ఆవిరి చేశారని, చంద్రబాబు అబద్దపు ప్రచారాలు, బురద చల్లడం ధర్మమేనా అని పేర్కొన్నారు. సెకీతో జరిగిన ఒప్పందం విషయం మంత్రివర్గ సమావేశంలో చర్చించడంతో పాటు డిస్కంలు అంగీకారం తెలిపాయని వెల్లడించారు.