అమరావతి : ప్రముఖ నటుడు, టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Bala Krishna) పద్మభూషణ్ (Padmabhusan) పురస్కారానికి ఎంపిక కావడం పట్ల వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan ) శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం నిన్న ప్రకటించిన పద్మ విభూషణ్, పద్మ భూషణ్ , పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఏపీకి చెందిన వారికి జగన్ ట్విటర్లో (Twitter) శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి (Doctor Nageshwar Reddy) భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. కొత్త కొత్త వ్యాధులకు చికిత్స నందించడంలో నాగేశ్వర్‌రెడ్డి సేవలు విశేషమైనవని ప్రశంసించారు.
అత్యాధునిక వైద్య పద్ధతులు, చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్రని కొనియాడారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు.
ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారు మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మాడుగుల నాగఫణి శర్మ (కళలు)
కేఎల్ కృష్ణ (విద్య, సాహిత్యం) , మిరియాల అప్పారావు (కళలు), వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి (విద్య, సాహిత్యం) లకు అభినందనలు తెలిపారు.