YS Jagan | రాష్ట్రంలో టీడీపీ హయాంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నదని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయని, వైద్య రంగం పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వ్యవసాయ రంగం కుదేలు కావడంతో విచ్చలవిడిగా అవినీతి పెరిగి పోయిందని గురువారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని తన వివాసంలో శ్రీశైల జిల్లా పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకతను తెచ్చుకున్న ప్రభుత్వాన్ని తాను చూస్తున్నానని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి, తమ ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారనిచెప్పారు. అందుకే రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం అన్నారు.
రాజకీయ పార్టీలు సాధారణంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి, ఎన్నికలైన తర్వాత దాన్ని చెత్తబుట్టలో పడేస్తాయని వైఎస్ జగన్ చెప్పారు. కానీ, తొలిసారి 2019-24 మధ్య తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తు.చ. తప్పుండా అమలు చేసిందని సగర్వంగా చెప్పగలను అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీతగా భావిస్తూ 99 శాతం హామీలు అమలు చేసిందని తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఏ రంగానికి ఎంతెంత ? ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామన్న వివరాలు ముందే వెల్లడించామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఓ పథకం అమలు చేశారన్నారు. చిన్న పిల్లలకు రూ.15 వేలు, తల్లులకు రూ.18 వేలు, యువకుడికి రూ.36 వేలు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ప్రతి కుటుంబానికి తమ ప్రభుత్వం సాయం చేస్తే, టీడీపీ ఇంట్లో ప్రతి ఒక్కరికి సాయం చేస్తామని అన్నట్లు అబద్దాలు చెబుతున్నారన్నారు.