Viveka Murder Case | వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case) లో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) పై సీబీఐ విచారణ ముగిసింది. రెండోసారి విచారణలో భాగంగా శుక్రవారం వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి తన న్యాయవాదులతో కలిసి వచ్చారు. అయితే, సీబీఐ అధికారులు కార్యాలయంలోకి అవినాశ్ రెడ్డి న్యాయవాదులను అనుమతించలేదు. శుక్రవారం దాదాపు 4.30 గంటల పాటు అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) ని సీబీఐ అధికారులు విచారించారు.
సీబీఐ అధికారుల విచారణ ముగిసిన తర్వాత అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) మీడియాతో మాట్లాడారు. `వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case) దర్యాప్తులో భాగంగా విచారణకు రావాలని నన్ను సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఆ మేరకు విచారణకు హాజరైన నేను.. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసినంత వరకు జవాబులిచ్చా. ఇదే అంశంలో గతంలోనూ నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశా. ఇప్పుడు మరోమారు కోరుతున్నా. వైఎస్ విజయమ్మ దగ్గరకు వెళితే, నేను ఆమెను బెదిరించి వచ్చానని టీవీల్లో వార్తలు ప్రసారం చేశారు. టీవీ చానెళ్లలో డిబెట్లు పెట్టి మరీ అసత్య ప్రచారం చేశారు. ఇది సరి కాదు. నేను దుబాయికి వెళ్లినట్లు వక్రీకరణలతో ప్రచారం చేస్తున్నారు. ఒక విషయంపై దర్యాప్తు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నా` అని చెప్పారు.
`వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు మార్చురీ వద్ద కూడా మీడియాతో మాట్లాడా. ఆ తర్వాత రెండు రోజులకు కూడా మీడియాతో మాట్లాడా.. అప్పుడు చెప్పిన విషయాలే ఇప్పుడు సీబీఐ అధికారులకు వెల్లడించాను. నన్నెవరు అడిగినా అదే చెబుతాను. సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నన్ను విచారిస్తున్నారు. సరైన పద్దతిలో సీబీఐ విచారణ జరుగాలని నేను కోరుతున్నా. నాడు హత్య జరిగిన రోజు ఘటనా స్థలం వద్ద లేఖ ఉంది. అదెందుకు దాచారు. ఈ రోజు విచారణలో నా లాయర్లను అనుమతించాలని, విచారణ తీరును రికార్డింగ్ చేయాలని కోరా. ఈనాడు జరిగిన విచారణను రికార్డు చేసినట్లు లేదు. గత నెల 28న తొలిసారి సీబీఐ విచారణకు హాజరయ్యాను. విచారణ ముగిసిన తర్వాత మరోసారి రావాల్సి ఉంటుందని సీబీఐ అధికారులు చెప్పారు. కానీ, ఈ రోజు విచారణ తర్వాత మరోమారు విచారణకు హాజరు కావాలని వారు నాకు చెప్పలేదు` అని అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) తెలిపారు.