అమరావతి : రాష్ట్ర పునర్నిర్మాణం,పేదరిక నిర్మూలన, సమసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలని
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద (Swami Vivekananda ) జయంతి, యువజన దినోత్సవం సందర్భంగా ట్వీటర్ వేదిక ద్వారా యువతకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని’ స్వామి వివేకానంద పిలుపును ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శక్తివంతమైన సోషల్ మీడియా, ఇంటర్ నెట్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా, అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రాబోయే ఐదేళ్ళలో కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు శ్రమిస్తున్నామని అన్నారు.
ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేసే లక్ష్యంతో కార్యక్రమాలు రూపొందిస్తున్నామని, దేశంలో మొదటిసారిగా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నామని వెల్లడించారు. మీరు లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటిని చేరుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
యువతకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
స్వామి వివేకానంద జయంతి, యువజ దినోత్సవం సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) యువతకు శుభాకాంక్షలు తెలిపారు. వివేకానంద సూచించిన విధంగా ‘ లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి’ పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు.