Viral News | ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం ఆ బాలికకు పిచ్చి.. అదే ఆమెను ఇరకాటంలో పడేసింది. తాను చేసే రీల్స్‌కు ఎప్పటికప్పుడు లైక్ కొడుతున్నాడని మాట్లాడితే మాటలతో మభ్యపెట్టాడు. కలిసి రీల్స్ చేద్దామని గుడికి తీసుకెళ్లి ఏకంగా తాళి కట్టేశాడు. అలా ఒక్కసారి కాదు.. రెండు సార్లు ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఏపీలోని విశాఖలో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నం శివారు ప్రాంతమైన తాటిచెట్లపాలెం రెడ్డివీధికి చెందిన ఓ 15 ఏళ్ల బాలికకు రీల్స్ అంటే పిచ్చి. రోజూ ఏదో ఓ రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆ బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే భార్గవ్ అనే యువకుడు ఆమె రీల్స్ చూసి ఇష్టం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక రీల్స్ చూసి లైక్ కొట్టేవాడు. అలా బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. కాస్త మాటల వరకు వెళ్లేసరికి బాలిక ఫోన్ నంబర్‌ను భార్గవ్ అడిగి తీసుకున్నాడు. ఆ తర్వాత తనకు కూడా రీల్స్ చేయాలని ఉందని.. దానికి సహకరించాలని బాలికను అడిగాడు. అందుకు ఆమె నో చెప్పడంతో చనిపోతానని కూడా బెదిరించాడు. దీంతో సదరు బాలిక అతనితో రీల్స్ చేయడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల కైలాసపురం కొండ మీద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కలుసుకున్నారు. ఆ తర్వాత జనవరి 9వ తేదీన కూడా మళ్లీ అదే ప్రాంతంలో కలుసుకున్నారు. ఆ సమయంలో బలవంతంగా బాలికకు భార్గవ్ తాళి కట్టాడు.
కొద్దిరోజులు గడిచిన తర్వాత మళ్లీ సదరు బాలికను భార్గవ్ సింహాచలం తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి తాళి కట్టి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులు బాల్య వివాహ నిరోధక చట్టం, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. శనివారం నాడు భార్గవ్‌ను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.