AP News | ప్రేమించిన అమ్మాయినే దారుణంగా గొంతు కోసి చంపేశాడో యువకుడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషాద ఘటన ఏలూరులోని సత్రంపాడులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సత్రంపాడుకు చెందిన ఓ యువతి ప్రైవేటు కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తోంది. యేసురత్నం అనే యువకుడిని ఆమె కొంతకాలంగా ప్రేమిస్తోంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా గడపాలని అనుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇటీవల పెద్దలకు కూడా చెప్పారు. కానీ ఇరువురి తల్లిదండ్రులు వాళ్ల ప్రేమను అంగీకరించలేదు. పైగా యువతికి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశారు. గత వారమే నిశ్చితార్థం కూడా జరిగింది.
ఈ క్రమంలో యువతి దగ్గరకు వచ్చిన యేసురత్నం తనతో రావాలని కోరాడు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. కానీ అందుకు యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన యేసురత్నం.. యువతి గొంతు కోశాడు. అనంతరం తాను కూడా గొంతుకోసుకున్నాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మరణించింది. ఇది గమనించిన స్థానికులు యేసురత్నాన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యలోనే యేసురత్నం కన్నుమూశాడు.