AP News | పక్కింటి యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీయడం పెను విషాదానికి దారి తీసింది. తనను వీడియో తీయడం గమనించిన యువతి.. కుటుంబసభ్యులకు చెప్పడంతో సదరు యువకుడిని చితకబాదారు. అతన్ని ఇంట్లోనే బంధించారు. దీంతో పరువు పోయిందని భావించిన సదరు యువకుడు అదే ఇంట్లో కేబుల్ వైర్లతో ఉరేసుకున్నాడు. ఏపీలోని విశాఖలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా పూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన గొండేటి తాతారావు, పార్వతి దంపతుల రెండో కుమారుడు భాస్కరరావు (30).. వైజాగ్‌లోని ఫార్మాసిటీలోని ఒక కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గాజువాక శ్రీనగర్ సమీపంలోని శ్రీరాంనగర్‌లో కిరాయికి ఉంటుడున్నాడు. పెళ్లి కాకపోవడంతో రూంలో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం పక్కింటి యువతి స్నానం చేస్తుండగా మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. ఇది గుర్తించిన యువతి కుటుంబసభ్యులు భాస్కర్‌రావును నిలదీశారు. వెంటనే అతని ఫోన్ లాక్కొని వీడియోను డిలీట్ చేయించారు.
అనంతరం భాస్కరరావుపై యువతి కుటుంబసభ్యులు చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా అతని తల్లిదండ్రులను పిలిపించి సంగతి చూస్తామని బెదిరించారు. అతన్ని ఓ గదిలో నిర్బంధించారు. విజయనగరంలో ఉండే తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పి రప్పించారు. వారు వైజాగ్‌కు వచ్చిన తర్వాత తలుపులు తీసి చూడగా.. భాస్కరరావు నిర్జీవంగా కనిపించాడు. ఆ గదిలోని సీలింగ్ ఇనుపరాడ్డుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని కనిపించాడు. దీంతో భాస్కరరావు తల్లిదండ్రులు హతాశులయ్యారు. తన కుమారుడి ముఖంపై గాయాలున్నాయని.. కావాలనే తన కుమారుడిని కొట్టి చంపేశారని భాస్కరరావు తల్లిదండ్రులు ఆరోపించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. భాస్కరరావు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు యువతి సహా మరో నలుగురు కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపరచడం, గదిలో నిర్బంధించడం నేరమని.. అందుకే ఘటనకు కారణమైన ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.