తూర్పు గోదావరి జిల్లా : యువ వ్యోమగామి జాహ్నవి దంగేటి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. అంతరిక్ష శిక్షణకు సహాయం చేయాలని ఆమె సీఎంకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయల్దేరుతున్న సమయంలో వచ్చిన జాహ్నవి.. సీఎం జగన్ను కలిసి తనకు పైలట్ ఆస్ట్రోనాట్ అవ్వాలన్న కోరిక ఉన్నదని అందుకు అవసరమైన శిక్షణకు ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థించింది. పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంలో పాల్గొని చరిత్ర సృష్టించిన తొలి భారతీయురాలుగా గుర్తింపు పొందారు. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్ఫూర్తితో అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు కృషిచేస్తున్నట్లు జాహ్నవి సీఎంకు వివరించారు.
నాసా ప్రోగ్రాంకు ఎంపికైన జాహ్నవిని సీఎం జగన్ అభినందించారు. రాష్ట్రం నుంచి ఓ యువ వ్యోమాగామి ప్రపంచానికి అందిరావడం గర్వకారణంగా ఉన్నదన్నారు. స్పేస్ ట్రైనింగ్ కోసం సాయం చేయాల్సిందిగా జాహ్నవి చేసిన విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణతోపాటు జాహ్నవి తల్లిదండ్రులు కూడా ఉన్నారు.