అమరావతి : పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandra babu) మరోసారి వెల్లడించారు. బుధవారం ఆయన ఏలూరు జిల్లా పోలవరంలో మంత్రులతో కలసి పోలవరం ప్రాజెక్టు ( Polavaram Project ) ను సందర్శించారు. కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పోలవరంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
వైసీపీ రాష్ట్రంలోని రాయలసీమ నీటి ప్రాజెక్టులపై చిల్లర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. రాయలసీమకు ఎత్తిపోతల ద్వారా నీటి వాడకాన్ని నిలిపివేసినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తుందని దుయ్యబట్టారు. తనపై బురద చల్లడం వల్ల ఆరోపణలు నిజం కాబోవని స్పష్టం చేశారు. కన్స్ట్రక్టీవ్ రాజకీయాలు చేయాలని సూచించారు.
పోలవరం గ్యాప్ -1లో పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్యాప్-2లో అప్‌స్ట్రీమ్ , డౌన్ స్ట్రీమ్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. రైట్ కనెక్టివిటీలో 19 మీటర్లు వెడల్పు, ఎత్తుతో రెండు టన్నెళ్లు వస్తాయని పేర్కొన్నారు. విశాఖకు నీరు తీసుకెళ్లే కాలువను బాగా వెడల్పు చేశామని, దీంతో అనకాపల్లి, విశాఖ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని వెల్లడించారు.
పట్టిసీమ ఎత్తిపోతలను ఏడాది వ్యవధిలో పూర్తి చేశామని వివరించారు. ఈ సంవత్సరం 97 శాతం అన్ని జల నీటివనరుల్లోకి నీరు వచ్చి చేరిందని , ప్రస్తుతం అన్ని జలాశయాల్లో 780 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇది ఎంతో గర్వకారణమని అన్నారు. శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేసి రాయలసీమకు నీరివ్వగలిగామని వెల్లడించారు. రాయలసీమలో గొల్లపల్లి కట్టి కియా మోటార్స్ తీసుకొచ్చానని వివరించారు.