అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను (MLC Election) బహిష్కరిస్తూ (Boycott) వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. ఈ సందర్భంగా వైసీపీ కూడా ఎన్నికలకు సన్నద్ధం అవుతుండగా సడెన్‌గా రెండు జిల్లాల్లో ఎన్నికలను బైకాట్ చేస్తున్నట్లు వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని(Perninani) ప్రకటించడం సంచలనంగా మారింది.
రాష్ట్రంలో శాంతియుత వాతావరణం లేదని, తమ నేతలను,కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న పరిస్థితుల్లో బైకాట్ నిర్ణయం తీసుకున్నామని పేర్నినాని గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వాపోవడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుందని వ్యాఖ్యనించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుందని ఆరోపించారు. అప్రజాస్వామికంగా పోలీసులను అడ్డంగా పెట్టి వైసీపీ రాజకీయ నాయకులపై వేధింపులకు పాల్పడుతున్న దృష్ట్యా వైసీపీ ఎమ్మెల్సీ పోటీ నుంచి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.