Vijaya sai Reddy | ఏపీలోని కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైజాగ్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్లాన్ ప్రకారం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. తన పేరు, ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నవారు ఎంతటి వారైన వదిలిపెట్టమని హెచ్చరించారు. దుష్ప్రచారం చేసేది తమ పార్టీ వాళ్లయినా సరే వదలనని అన్నారు. తనను భయపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నామని వెనక్కి తగ్గమని అన్నారు. ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగినా మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేవారు. అధికారంలోకి వస్తాం.. తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు.
ఓ ఆదివాసీ మహిళకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీలోని కొందరు కూడా తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. నాపై కుట్రలు చేస్తున్న వాళ్లందరికీ బుద్ధి చెబుతానని అన్నారు. వీరిపై పార్లమెంట్లో ప్రివిలేషన్ మోషన్ ఇస్తా.. పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతానని చెప్పారు.