AP News | వైసీపీకి మరో షాక్ తగలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటికే పలువురు టీడీపీలో చేరగా.. తాజాగా మరో కీలక నేత కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రేపు వైసీపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం.
మోపిదేవి వెంకట రమణ కొంతకాలంగా వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేపల్లె నుంచి ఆయన టికెట్ ఆశించారు. తనకు లేదంటే తన కుమారుడికి జగన్ అసెంబ్లీ టికెట్ ఇస్తాడని భావించారు. కానీ సామాజిక సమీకరణ పేరుతో మోపిదేవి ఫ్యామిలీకి జగన్ టికెట్ నిరాకరించారు. మోపిదేవికి బదులు గణేశ్‌ను రేపల్లె నుంచి బరిలో దించాడు. అప్పట్నుంచి అసంతృప్తిలో ఉన్న మోపిదేవి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో చర్చలు కూడా జరిపారు. త్వరలోనే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
మోపిదేవి వెంకటరమణకు వైసీపీలో మంచి ప్రాధాన్యతే ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వంతో పాటు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగానూ ఆయన ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మోపిదేవికి జగన్ ప్రాధాన్యత కల్పించారు. 2019 ఎన్నికల తర్వాత మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. కేబినెట్లోకి తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి ఆయన్ను రాజ్యసభకు పంపించారు.