ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై ఎమ్మెల్సీ, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించాలని చూడలేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇవాళ మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ.. మద్య నియంత్రణను ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపులను ఎవర్ని ఉద్ధరించడానికి ప్రైవేటు పరం చేస్తున్నారని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి రోజు బ్రాందీ పాలసీని ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ఈ మద్యం పాలసీ అమలైతే మహిళల పసుపు కుంకుమలకు గ్యారంటీ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ఇంటింటికీ పథకాలు తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారని.. కానీ ఇప్పుడు ఇంటింటికీ మద్యం పథకాన్ని తీసుకొచ్చారని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేసి, మద్యం మాత్రం రూ.99కే ఇస్తామని అంటున్నారని.. ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలు ఆడుకోండని చంద్రబాబు చెబుతున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే అమ్మకాలపై నియంత్రణ ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. మద్యాన్ని ప్రైవేటుపరం చేసి విచ్చలవిడి అమ్మకాలు పెరిగే పాలసీని తీసుకురావడం దారుణమని అన్నారు. మహిళా సంఘాలు వద్దంటున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళల తాళిబొట్లు తెగినా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన @ncbn
ఇవాళ మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచాడు
దేవుళ్లపైనా చులకనగా మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది
అయ్యప్ప స్వామి దీక్షల వల్ల మద్యం ఆదాయం తగ్గిందని బాధపడ్డాడు
వీధికో బెల్టు షాపు పెట్టి, మద్యం ఏరులై పారించాడు
మళ్లీ ఇప్పుడు… pic.twitter.com/Qj8UQEEXez— YSR Congress Party (@YSRCParty) October 2, 2024
దేవుళ్లపైనా చులకనగా మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది అని వరుదు కల్యాణి విమర్శించారు. అయ్యప్ప స్వామి దీక్షలు వేసుకంటే మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని బాధ పడిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. గతంలో వీధికో బెల్టుషాపు పెట్టి, మద్యం ఏరులై పారించారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ తరహాలో లిక్కర్ కాంప్లెక్స్ తీసుకురావడం ఏంటని? తిరుపతిలో 227 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ మద్యం పాలసీని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు.
వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యం లేదన్న చంద్రబాబు.. ఈ మూడు నెలలుగా అదే మద్యాన్ని ఎందుకు అమ్ముతున్నారని వరుదు కల్యాణి ప్రశ్నించారు. ఆ బ్రాండ్స్‌ను ఎందుకు తొలగించలేదని నిలదీశారు. మద్యం సిండికేట్స్ వల్ల విచ్చలవిడిగా మద్యం వినియోగం పెరిగి క్రైమ్ రేటు కూడా ఎక్కువ అవుతుందని ఆరోపించారు. వీటన్నింటిపైనా మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు.