అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విజభనపై అధికార పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాల తీర్మాణాలను కలెక్టర్‌కు అందించేందుకు వెంకటగిరికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాల విభజనతో పాటు కొన్ని ప్రాంతాలను ఇతర ప్రాంతాల్లో కలపడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను బాలాజీ జిల్లాలో కలపడం సరైన నిర్ణయం కాదని ఆయన పేర్కొన్నారు. నియోజక వర్గ కేంద్రంగా ఉన్న రాపూరును వెంకటగిరిలో విలీనం చేసి నష్టపరిచారని ఆరోపించారు. ఇప్పుడు నెల్లూరు కాకుండా బాలాజీ జిల్లాలో కలుపుతున్నారని తెలిపారు. కాగా సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురం పట్టణంగా గుర్తించాలని పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ప్రకాశం జిల్లాకు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ మాజీ సైనికులు ఈరోజు ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం గడియారం స్తంభం నుంచి కోర్టు కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఒంగోలు వద్దు మార్కాపురం ముద్దు అంటూ నినాదాలు చేశారు. పల్నాడు జిల్లాకు గురజాల కేంద్రంగా ఉంచాలని కోరుతూ జిల్లా సాధన సమితి పిడుగురాళ్లలో మహా ర్యాలీ నిర్వహించింది . ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని టీడీపీ నాయకుడు వై. శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు.