AP News | టీడీపీ నేతల తీరుపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఒక్కో రైతు నుంచి రూ.8 లక్షలు తీసుకున్నట్లు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని అర్బన్ లేఔట్‌ను శుక్రవారం ఎమ్మెల్యే బాలినేని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు.
ఒంగోలులో పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని.. హైకోర్టులో కొందరు పిల్ వేశారని.. వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఇంతటి నీచ రాజకీయాలను తన జీవితంలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలకు ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. తాను పోటీ చేసినా.. చేయకపోయినా.. 25వేల మందికి పట్టాలు పంపిణీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఈ నెల 20న ఏపీ సీఎం జగన్ ఒంగోలులో పర్యటిస్తారని.. అదే రోజున అర్బన్ లేఔట్లో సిద్ధం చేసిన 25వేల ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు జగన్ చేతుల మీదుగా అందజేస్తామని వెల్లడించారు.