ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని వైసీపీ మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హోంమంత్రిగా వంగలపూడి అనిత విఫలమయ్యారని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణే స్వయంగా చెప్పారని మాజీ మంత్రి రోజా సెల్వమణి అన్నారు. తాము కూడా అనిత తీరును మొదట్నుంచి ఎండగడుతూనే ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై పెరుగుతున్న నేరాలకు నైతిక బాధ్యత వహించి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనితతో పాటు చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలమైందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి అన్నారు. శాంతి భద్రతల వైఫల్యానికి హోం మంత్రి అనితనే కారణమని వైసీపీ మొదట్నుంచే చెబుతోందని అన్నారు. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై హోంమంత్రి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మహిళలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదని.. హోంమంత్రి అనిత మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారని విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను తిట్టడానికే అనితకు హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఉందని ఎద్దేవా చేశారు. హోంమంత్రి అనితను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. కేబినెట్ పూర్తిగా విఫలమైందని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.